అగ్పిపుల్లా, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలతో స్ఫూర్తి పొందిన మాజీ సీఎం జగన్….చివరకు చెత్తపై కూడా పన్ను విధించిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా చెత్త పన్ను చెల్లించని వారి ఇళ్లు, దుకాణాల దగ్గర నుంచి చెత్తను సేకరించకుండా జగన్ ప్రభుత్వం టార్చర్ పెట్టిన వైనం అప్పట్లో సంచలనం రేపింది, అయితే ప్రభుత్వం మారినా సరే కడప మేయర్ సురేశ్ తీరు మాత్రం మారలేదు.
చెత్త పన్ను చెల్లించకపోతే చెత్త సేకరించేది లేదంటూ కడప మేయర్ మొండిపెట్టు పట్టారు. అయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పై పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నేతలు ఆ క్రమంలోనే చెత్త పన్ను చెల్లించవద్దంటూ ప్రజలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలాచోట్ల చెత్త పన్ను చెల్లించని వారి దగ్గర నుంచి చెత్త సేకరించడం లేదు. ఈ క్రమంలోని తాజాగా కడప ఉదంతంపై కడప టిడిపి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిప్పులు చెరిగారు.
చెత్త పన్ను చెల్లించవద్దని, అంతేకాకుండా తమ ఇళ్ల దగ్గర చెత్త తీసుకెళ్లి మేయర్, వైసిపి కార్పొరేటర్ ల ఇళ్ళ ముందు పారబోయాలని కడప ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపద్యంలోనే మేయర్ ఇంటిముందు కొంతమంది ప్రజలు చెత్తను తీసుకొచ్చి వేశారు. అంతేకాకుండా మేయర్ ఇంటి ముందు బైఠాయించి మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.