అత్తకొట్టిన దానికంటే కూడా తోడికోడలు చూసి నవ్విన దానికే ఎక్కువగా బాధ ఉంటుందనేది సామెత. ఇప్పడు హీరో అక్కినేని నాగార్జున పరిస్థితి అలానే ఉంది. తెలంగాణ సర్కారు నుంచి అక్కినేనికి హైడ్రా రూపంలో భారీ ఎదురు దెబ్బతగిలింది. మాదాపూర్లో తుమ్మడి చెరువును ఆక్రమించి `ఎన్` కన్వెన్షన్ నిర్మించారంటూ.. దానిని నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాగార్జున హైకోర్టుకు వెళ్లడం.. అక్కడ నుంచి స్టే రావడం విదితమే. అయితే.. ఇంతలోనే కట్టడం నేల మట్టమైంది.ఈ బాధ నుంచి అక్కినేని నాగార్జున ఇంకా కోలుకోనేలేదు. పైగా.. ఆయన మానసికంగా కూడా బాధపడు తున్నారు. ఇంతలోనే కామ్రెడ్ చికెన్ నారాయణ తగులుకున్నారు.
అసలే ఆవేదనలో ఉన్న నాగార్జునపై కాకిలాగా.. పొడిచి వదిలి పెట్టారు. తగిన శాస్తి జరిగిందని.. ఇలా చేయాల్సిందేనని.. కామ్రెడ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. “నాగార్జున మంచి నటుడే.. కానీ, ఈ కక్కుర్తి ఎందుకు“ అని దెప్పి పొడిచారు. ఇక్కడితో కూడా కామ్రెడ్ వదల్లేదు.. క్షేత్రస్థాయిలో పర్యటించారు.
“జీవితం అంటే సినిమా డైలాగులు కొట్టడం కాదు. నాగార్జున బుకాయింపు మాటలు మానాలి. చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణం అని తేలిపోయింది. కాబట్టి నాగార్జున క్షమాపణ చెప్పాలి. ఇంతకాలం `ఎన్` కన్వెన్షన్ ద్వారా ఫంక్షన్లు, రాజకీయ కార్యక్రమాలు, ఇతర కమర్షియల్ ఈవెంట్ల రూపంలో సంపాయించిన కోట్ల రూపాయలపై జరిమానా కట్టాలి. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి“ అని కామ్రెడ్ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లో ఆక్రమణలుపెరిగిపోయాయని, అరగంట వర్షం పడితే.. ఎక్కడికక్కడ భాగ్యనగరం మునిగిపోతోందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని కూడా నారాయణ చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టుల పక్షాన తాము అండగా ఉంటామన్నారు. పనిలో పనిగా ఆయన బీఆర్ ఎస్ గత పాలనను విమర్శించారు. అప్పట్లో మాటలు చెప్పి.. తప్పించుకున్నారని… ఇప్పుడు రేవంత్ పనిచేసి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. నారాయణకు నాగార్జునకు గతంలోనే వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. నాగార్జున వ్యాఖ్యతగా నిర్వహించిన `బిగ్బాస్`ను నారాయణ బ్రోతల్ హౌస్గా చిత్రీకరించి.. హైకోర్టు వరకు వెళ్లిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.