నిజమే… రివర్స్ టెండరింగ్ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టగానే రివర్స్ టెండరింగ్ అంటూ బాకాలు ఊదేసి… అప్పటికే మొదలైన పనులకు కూడా తక్కువ ధరలకే కొత్తగా టెండర్లు పిలిచి… ఇప్పుడేమో… అవే పనులకు ఏకంగా డబుల్ మొత్తాలను అదనంగా చెల్లించేందుకు రంగం సిద్ధమైన తీరు చూస్తుంటే… ఇదెక్కడి రివర్స్ టెండరింగో అర్థం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతరత్రా పనులైతే పెద్దగా పట్టింపు ఉండేదేమో గానీ… ఏపీకి జీవనాడిగా పేరు పడిన పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఇలా జగన్ మార్కు రివర్స్ టెండరింగ్ కాస్తా… పూర్తిగా డబుల్ రివర్స్ అయిపోయిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని చెప్పాలి.
ఇక అసలు విషయానికి వస్తే… జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కై పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని వైసీపీ సర్కారు ఆరోపించింది. అంతేకాకుండా తాము చేపట్టే రివర్స్ టెండరింగ్ ద్వారా దోపిడీకి గురయ్యే సొమ్మును ప్రభుత్వ ఖజానాకు తిరిగి జమ చేస్తామని కూడా ప్రకటించింది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన పోలవరం ప్రధాన డ్యామ్ పనులను గతంలో చేపట్టిన నవయుగ కంపెనీ.. ఆ పనులను రూ.5,535 కోట్లకే చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తానికి పనులు చేసినా నష్టమేనని తెలిసినా కూడా రాష్ట్రంలో ప్రధాన ద్యామ్ అయిన పోలవరం పనులను చేయడం ద్వారా ఎనలేనీ ఖ్యాతిని చేజిక్కించుకోవచ్చన్న భావనతో నవయుగ ఆ పనులను చేపట్టింది.
అయితే జగన్ సీఎం కాగానే… పోలవరం ప్రధాన డ్యాం పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా బిడ్లను ఆహ్వానించింది. ఈ టెండర్లలో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు చెందిన మేఘా కంపెనీ… రూ.5,535 కోట్ల విలువైన పనులను రూ.780 కోట్ల మేర తక్కువకే చేస్తానంటూ బిడ్ దాఖలు చేసింది. దీంతో ఒక్క పోలవరం పనుల్లోనే సర్కారీ ఖజానాకు రూ.780 కోట్ల మేర ఆదా చేశామని జగన్ సర్కారు గొప్పలు చెప్పుకుంది. ఇదంతా జరిగి ఏడాదిన్నర అయిందో లేదో అప్పుడే.. జగన్ ప్రవచించిన రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో జనానికి తెలిసి వచ్చేసింది.
రూ.780 కోట్ల మేర తక్కువకు పనులు దక్కించుకున్న మేఘా సంస్థకు ఇప్పుడు కొత్తగా రూ.1,600 కోట్ల మేర అదనపు నిధులను ఇచ్చేందుకు జగన్ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే… రివర్స్ టెండరింగ్ పేరిట సర్కారు ఖజానాకు రూ.780 కోట్ల మేర ఆదా జరగగా… ఇప్పుడు ఆ రివర్స్ టెండరింగ్ మరోమారు రివర్స్ అయిపోయి ఏకంగా అంతకంటే రెట్టింపు నిధులను కొత్త కాంట్రాక్టు సంస్థకు ఇస్తున్నారన్న మాట. మొత్తంగా జగన్ మార్క్ రివర్స్ టెండరింగ్ తో మేఘాకు అదనంగా రూ.840 కోట్ల మేర ఆయాచిత లబ్ధి జరిగిందన్న మాట.