విదేశీ పర్యటనలకు వెళ్ళేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో యూకే, యుఎస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి విడివిడిగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ లపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
జగన్ పిటిషన్ పై తుది నిర్ణయం ఈ నెల 27 న, విజయసాయి పిటిషన్ పై తుది నిర్ణయం ఈ నెల 30న తీసుకుంటామని వెల్లడించింది. జగన్, విజయసాయిల విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్, విజయసాయిరెడ్డిల తరఫు న్యాయవాదులు అనుమతివ్వాలని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ, తుది నిర్ణయాన్ని ఈ నెల 27, 30లకు వాయిదా వేసింది.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డిలు నిందితులుగా ఉన్నారు. దీంతో, వారు విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే వారు కోర్టును ఆశ్రయించగా సీబీఐ వారికి అనుమతి ఇవ్వొద్దని కౌంటర్లు దాఖలు చేసింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో జగన్, విజయసాయిలకు షాక్ తగిలినట్లయింది.