భారీ అంచనాలున్న ఒక పెద్ద సినిమా రిలీజవుతోందంటే దానికి పోటీగా వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి సందేహిస్తారు. ‘పుష్ప-2’ అలాంటి సినిమానే. ‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దీని సీక్వెల్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు అనుకున్న ప్రకారం ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కావాల్సింది. ఆ టైంలో దానికి పోటీగా నిలవడానికి ఏ చిత్రం ముందుకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఉత్తరాదిన కూడా ఈ చిత్రం మీద భారీ అంచనాలుండడంతో బాలీవుడ్ నుంచి ఈ వీకెండ్కు గతంలో ఏ సినిమానూ అనౌన్స్ చేయలేదు. ‘పుష్ప-2’ వాయిదా పడ్డక ఇండిపెండెన్స్ డే వీకెండ్ రేసులోకి చాలా సినిమాలు వచ్చేశాయి. ఐతే పుష్ప-2కు డిసెంబరు 5న కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయగా.. దానికి పోటీగా ఒక్కో సినిమా రేసులోకి వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఆల్రెడీ మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ను డిసెంబరు తొలి వారంలో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు చెప్పారు. ఇప్పుడేమో చిన్న సినిమా అయిన ‘బ్రహ్మ ఆనందం’ను డిసెంబరు 6కు ఫిక్స్ చేసేశారు. హిందీలో విక్కీ కౌశల్ మూవీ ‘చవ్వా’ను డిసెంబరు 6న రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు. ‘పుష్ప-2’ లాంటి భారీ చిత్రంలో ఇవేవీ పోటీ పడే స్థాయిలో లేవు.
మరి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ‘పుష్ప-2’ డిసెంబరు 6న కూడా రాదనే ధీమాతో వీళ్లు డేట్లు ఇచ్చేస్తున్నారా లేక.. తమ చిత్రాల మీద ఉన్న నమ్మకంతో ‘పుష్ప-2’ డిసెంబరు తొలి వారంలోనే వచ్చినా తమకు ఇబ్బంది లేదని అనుకుంటున్నారా అన్నది అర్థం కాని విషయం. ఏదేమైనా ‘పుష్ప-2’ అంటే మిగతా వాళ్లకు భయం తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలో మంచి టీజర్ రెడీ చేసి వదలడమే కాక డిసెంబరు 5నే ఈ చిత్రం వస్తుందనే ధీమాను చిత్ర బృందం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.