టాలీవుడ్లో హీరోయిజాన్ని రీడిఫైన్ చేస్తూ ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, దేశముదురు లాంటి హిట్లు, బ్లాక్బస్టర్లు ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఆయనొకరు. ఆయన స్ఫూర్తితో టాలీవుడ్లో ఎంతోమంది దర్శకులు వచ్చారు. చాలామంది హీరోలకు నటన, అప్పీయరెన్స్ పరంగా ఒక మేకోవర్ ఇచ్చి వారి కెరీర్లను మలుపు తిప్పిన ఘనత పూరీకే చెల్లుతుంది. ఇలా ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్‌గా నిలిచిన ఆ దర్శకుడే ఇప్పుడు మూస సినిమాలతో విసుగెత్తించేస్తున్నాడు. ఒక టైంలో మాఫియా నేపథ్యంలో అదిరిపోయే సినిమాలు ఇచ్చిన పూరి.. ఆ తర్వాత ఆ మాఫియా మత్తులో చిక్కుకుని చిత్తయిపోయాడు. ప్రతి సినిమాలో మాఫియా డాన్‌ను విలన్‌గా పెట్టడం.. దాని చుట్టూ కథల్ని నడిపించడంతో ప్రేక్షకులకు మొహం మొత్తేసింది.
పూరి సినిమా అనగానే మాఫియా వాసనలు గుప్పుమని తగలడం మామూలైపోయింది. ఇక ఆయన హీరోయిజం కూడా రొటీన్ అయిపోయింది. హీరోలు ఒకే రకమైన డోంట్ కేర్ యాటిట్యూడ్‌తో ఉంటారు. హీరోయిన్లను వెంటాడి వేధించి ప్రేమలోకి దింపడం.. వల్గర్ గా మాట్లాడ్డం.. పూరీ హీరోలు ఎప్పుడు చేసే పనే. ఇక వేరే క్యారెక్టర్లను కూడా చాలా అసభ్యంగా చూపిస్తాడనే చెడ్డ పేరును పూరీ మూట గట్టుకుంటున్నాడు.
‘డబుల్ ఇస్మార్ట్’లో ఈ అవలక్షణాల డోస్ బాగా ఎక్కువైపోవడంతో తీవ్ర విమర్శలు తప్పట్లేదు. ముఖ్యంగా ఆలీ పాత్ర జుగుప్సాకరంగా ఉండడంతో పూరీ మీద గట్టిగా ట్రోలింగ్ జరుగుతోంది. సక్సెస్ కోసం ఇంతగా దిగజారాలా అనే ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు. ఇంకా ఎంతకాలం ఇవే కథలు, ఇదే రైటింగ్, టేకింగ్ తో సినిమాలు తీస్తాడు అంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ చూశాక ఇస్మార్ట్ శంకర్ ప్లూక్ హిట్ అనే అభిప్రాయం కూడా బలపడుతోంది. పూరీ సినిమాల తీరు మారనంత వరకు ఆయనకు ఒకప్పటి స్థాయిలో సక్సెస్ రాదు అనేది మాత్రం స్పష్టం.