పవన్ కళ్యాణ్ తన పేరు వెనుక ఉన్న ‘పవర్ స్టార్’ తీసి పక్కన పెట్టేసి చాలా కాలమైంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ఆయన పూర్తి స్థాయి ‘జనసేనాని’గా మారిపోయారు. ఎన్నికలయ్యాక దీన్ని మించిన ‘డిప్యూటీ సీఎం’ అనే కొత్త ట్యాగ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా మంత్రిగా తన బాధ్యతల మీదే ఉంది. ఐతే ఆయన్ని మళ్లీ అప్పుడప్పుడు ‘పవర్ స్టార్’గా చూస్తూ ఉండాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు అభిమానులు కోరుకుంటున్నారు.
ఐతే ఎన్నికల ఫలితాలు వచ్చాక ఓ మూడు నెలలైనా పూర్తి స్థాయిలో పనిచేయనివ్వండి, తర్వాత వీలును బట్టి షూటింగ్‌లకు హాజరై పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేస్తా అంటూ ఓ పబ్లిక్ మీటింగ్‌లోనే అభిమానులకు మెసేజ్ ఇచ్చేశాడు పవన్. ఐతే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటిపోగా.. పవన్ త్వరలోనే ఓ సినిమాను రీస్టార్ట్ చేయబోెతున్న విషయం ఖరారైంది.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే పవన్ ‘హరిహర వీరమల్లు’ను రీస్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్ర బృందం ఆల్రెడీ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేసింది. పవన్ లేకుండానే మిగతా ప్రధాన తారాగణం.. వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను మొదలుపెట్టేశారు. ఈ విషయాన్ని ‘హరిహర వీరమల్లు’ టీం అధికారికంగానే ధ్రువీకరించింది. పవన్ మరి కొన్ని రోజుల్లోనే సెట్లో అడుగు పెడతాడట.
ఈ వార్ సీక్వెన్స్ పూర్తయితే వీరమల్లు పార్ట్-1కు సంబంధించి చిత్రీకరణ చాలా వరకు పూర్తయినట్లే. మరి కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలుంటుంది. ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణలో విపరీతమైన ఆలస్యం జరగడంతో దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణ బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. అతడి దర్శకత్వంలోనే కొత్త షెడ్యూల్ మొదలైంది.