మాజీ మంత్రి హరీష్ రావు కు కోపమొచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి ఆగ్రహం కాదు. ఈ మాత్రం ఆగ్రహం చూపించకపోతే తాను బుక్ అవుతానన్న విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే.. తనను అనే ఎదుటోడి మాటలకు పది రెట్లు ఎక్కువగా తానే మాట్లాడేసే పద్దతికి మరోసారి తెర తీశారు. పంద్రాగస్టు వేళ.. తాము ప్రజలకు ఇచ్చిన మాటకు తగ్గట్లే రుణమాఫీని పూర్తి చేసినట్లుగా పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్.. సవాలులో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావును రాజీనామా చేయాలని చెప్పటం తెలిసిందే. లేదంటే.. ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలన్నారు.
ఈ రెండు పనులకు హరీశ్ ససేమిరా అనటం ఖాయం. అందుకే ఆయన తన అమ్ములపొదిలోని మాటల ఆయుధాన్ని బయటకు తీశారు. తనను ఉద్దేశించి సీఎం రేవంత్ అన్న రెండు మాటలకు పన్నెండు మాటలు అంటే సరిపోతుందన్నట్లుగా ఆయన తీరు ఉంది. తనను రాజీనామా చేయాలన్న ముఖ్యమంత్రికి కౌంటర్ కాస్తంత ఘాటుగా ఇచ్చే ప్రయత్నం చేసి.. తన అధిక్యతను ప్రదర్శించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. ‘‘తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే సీఎం రేవంత్ రెడ్డిలా దిగజారిన.. దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరొకరు లేరు.నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో మాట్లాడితే అబద్ధాలు నిజాలు అయిపోవు. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లుగా రేవంత్ ప్రవర్తించటం లేదు. ఈ విషయాన్ని ప్రతి సందర్భంలోనే నిరూపించుకుంటున్నారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలోకానీ ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరన్న హరీశ్.. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ ప్రవర్తన ఉందన్నారు. ‘‘దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకొని కూడా మాట మీద నిలబడకపోగా.. నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీదా.. నా మీదా అవాకులు చెవాకులు పేలాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబరు 9నాటికి రూ.40 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చకలేక పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరో నాటకానికి తెర లేపిండు. ఆగస్టు 15వ తేదీ వరకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఉదగొట్టి.. రూ.9వేల కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు’’ అంటూ నిప్పులు చెరిగారు.
‘‘నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ ను తిడితేనో.. తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవు. మేం మొదటి దఫాలో రూ.లక్ష రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు రూ.17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా?’’ అంటూ ప్రశ్నిచారు. ఈ అంకెల మాటల్ని విన్నప్పుడు నిజమనిపించొచ్చు.
కానీ.. లాజిక్ ఏమంటే.. ఒకవేళ హరీశ్ చెప్పినట్లుగా రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ సమయానికి ఇవ్వలేదనుకుందాం. అలాంటి వేళలో.. ఆ విషయాన్ని స్కిప్ చేస్తారే కానీ ప్రశ్నించరు కదా? ఒకవేళ ఆ మాటల్ని ఆన్ రికార్డు మాట్లాడితే.. మీడియా ఉంది. సోషల్ మీడియా ఉంది ఉతికి ఆరేయటానికి. వాటిని హరీశ్ రావు ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఒకవేళ.. నిజంగానే రేవంత్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయలేదనే అనుకుందాం. చేసినట్లుగా చెబుతున్నారు కదా? ఆ జాబితా దమ్ముంటే ఇవ్వండని అడగొచ్చు. అదేమీ లేకుండా భాష మీద.. ఆవేశం మీదా హరీశ్ లాంటోళ్లు మాట్లాడితే అడ్డంగా బుక్ అవుతామన్న విషయాన్ని ఆయన ఎందుకు పట్టించుకోవటం లేదన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. సీఎం రేవంత్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా ఇచ్చిన హరీశ్ మాటలు ఇప్పటికైతే ఓకే కానీ.. ఆయన సవాలుకు తగ్గట్లు వ్యవహరించలేదన్న భావన ప్రజలకు కలగొచ్చన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.