మంకీపాక్స్ అలియాస్ ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికా దేశాల్ని వణికిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ ఆఫ్రికాలోని పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. దీంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తాజాగా ఆఫ్రికాలోనే కాదు యూరప్ లోని స్వీడన్ లోనూ ఒక ఎంపాక్స్ కేసు వెలుగు చూడటం గమనార్హం. మంకీ పాక్స్ వ్యాప్తిని అడ్డుకోవటానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలని డబ్ల్యూహెచ్ వో పిలుపునిచ్చింది.
ఎంపాక్స్ లో క్లేడ్ 2 కంటే క్లేడ్ 1 డేంజర్ గా చెబుతారు. గత సెప్టెంబరులో క్లేడ్ 2 బీ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఎంపాక్స్ సోకితే ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు.. చేతులపై కురుపులు.. పుండ్లు ఏర్పడతాయి. ఈ వైరస్ బారిన పడినోళ్లతో లైంగిక సంబంధాలు.. వారితో దగ్గగా వెళ్లటం ద్వారా త్వరగా వ్యాపించే వీలుంది. ఈ వైరస్ బారిన పడిన ప్రతి వంద మందిలో కనీసం నలుగురు మరణించే వీలుందన్న అంచనాలు ఉన్నాయి.
ఎంపాక్స్ ను కంట్రోల్ చేయటానికి వ్యాక్సిన్ వచ్చినా అది పరిమితంగా లభిస్తోంది. ఆఫ్రికా బయట దేశాల్లో ఎంపాక్స్ వైరస్ వెలుగు చూడటం కొత్త ఆందోళనకు తెర తీసింది. స్వీడన్ రాజధాని స్టాక్ హోంకు చెందిన ఒక వ్యక్తికి క్లేడ్ 1 రకానికి చెందిన వైరస్ వెలుగు చూసింది. ఈ తరహా వైరస్ ను ఆఫ్రికా వెలుపల గుర్తించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆఫ్రికాలోని 13 దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని పెద్దసంఖ్యలో గుర్తించారు.ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ లక్షణాల్ని చూస్తే..
– జ్వరం.. తలనొప్పి.. వాపు.. నడుంనొప్పి
– కండరాల నొప్పితో పాటు త్వరగా అలిసిపోయే గుణం
– స్మాల్ పాక్స్ (మన దగ్గర ఆట్లమ్మ) మాదిరి ముఖం.. చేతులు.. కాళ్లపై దద్దుర్లు.. బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే వీలుంది.