ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన సంగతి తెలిసిందే. 70 వేల పైచీలుకు ఓట్ల మెజారీటితో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించారు. దాంతో వారి రుణం తీర్చుకునేందుకు పవన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన బాబాయ్ కోసం పిఠాపురం వాసులకు ఓ అదిరిపోయే కానుక ఇవ్వాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడట.
పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హంగులతో దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా పేరున్న అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నారట. ఇందుకోసం రామ్ చరణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడట. మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
పిఠాపురంలో అపోలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తామని రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పవన్ కళ్యాణ్ కు మాటిచ్చారట. అందులో భాగంగానే రామ్ చరణ్ పది ఎకరాల ల్యాండ్ కొన్నారని.. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోందని రవణం స్వామినాయుడు పేర్కొన్నాడు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులను ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారని ఆయన తెలిపారు. నిజంగా అపోలో హాస్పటల్ ను అందుబాటులోకి తెస్తే పిఠాపురం ప్రజలకు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.