ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయాలు అక్కర్లేదు. అడగకపోయినా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి.. రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన మూడేళ్లకే నాగచైతన్య-శోభిత విడిపోతారని.. వారిద్దరి జాతకాలు మ్యాచ్ కాలేదని జోస్యం పేరుతో నోటికొచ్చినట్లు వేణు స్వామి మాట్లాడారు.
శుభమా అని ఒక జంట పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో వారికి విడాకులే అంటూ వేణు స్వామి జోస్యం చెప్పడం పెను దుమారం రేపింది. ఈ విషయంపై గత నాలుగు రోజుల నుంచి వేణు స్వామిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదే తరుణంలో తాజాగా వేణు స్వామికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ మహిళా కమిషన్ మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నాగచైతన్య-శోభితపై చేసిన వివాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణుస్వామిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాయి. ఇతరులపై వ్యక్తిగత విషయాలపై నలుగురిలో మాట్లాడకూడదనే జ్ఞానం లేని వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద వేణు స్వామికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని సమన్లు పంపారు. దీంతో జోస్యం పేరుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వేణు స్వామికి సరైన దెబ్బ తగిలిందని.. ఇక ఆయనకు చుక్కలే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.