తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించారు. పెట్టుబడులు రాబట్టుకునేందుకే ఈ యాత్రకు వెళ్తు న్నట్టు ఆయన ముందుగానే ప్రకటించారు. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా ఇదే విషయంపై ఎక్కువగా ఫోకస్ పెంచారు. రాష్ట్రం లో పెట్టుబడి దారులకు స్థిరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తోందని కూడా చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలోని ప్రవాస భారతీయులకు ఆయన పిలుపునిచ్చారు. ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు కథ తెరమీదికి వచ్చింది.
రేవంత్రెడ్డి పర్యటన అమెరికాలో ముగిసి.. దక్షిణ కొరియాలో ప్రారంభమైన తర్వాత.. తెలంగాణకు తీసుకువస్తున్న పెట్టుబడులు ఎన్ని? ఎంత మంది పెట్టుబడి దారులు సుముఖంగా ఉన్నారు? అనే విషయాలపై చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఏకంగా 31,500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ పెట్టుబడుల ద్వారా 30 వేల కొత్త ఉద్యోగాలు, అంతకు రెట్టింపు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. కాగా, రేవంత్రెడ్డి బృందం అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, డల్లాస్, కాలిఫోర్నియాలలో 50కి పైగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన విషయం తెలిసిందే.
వరుసగా మూడు రోజుల పాటు ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులపై పలు కంపెనీల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా బిజినెస్, ఏఐ, సెమీ కండక్టర్స్ తదితర అంశాలపై వివరించారు. దీంతో కొన్నిసంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫార్మా, ఐటీ, జీసీసీ, డేటా సెంటర్, ఏఐ, క్లౌడ్, డేటా సెంటర్స్, ఈవీ, బ్యాటరీలు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగానికి చెందిన కంపెనీల నుంచి సానుకూలత కనిపించినట్టు నాయకులు చెబుతున్నారు.