మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటి సినిమాల్లో ఆర్భాటమే తప్పా విషయం ఉండటం లేదని సెటైర్లు పేల్చిన వెంకయ్య నాయుడు.. తాజాగా మరోసారి చమక్కులు వినిపించారు. ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు కాంస్య విగ్రహన్ని విజయవాడులో సోమవారం నాడు ఆవిష్కరించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు.. తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఆచంట వెంకటరత్నం అంటూ కొనియాడారు. ఒకప్పుడు ప్రజలకు నాటకాలే వినోదమని.. సినిమాకి పైపై పుతలు పూయాల్సిన ఉంటుంది.. కానీ నాటకం నిజమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. నాటకం సినిమా కంటే గొప్పది మరియు కష్టమైందని అన్నారు. ప్రతి డైలాగ్ గుర్తు పెట్టుకొని స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వాలని వివరించారు.
ఇక నేటి సినిమాలు అసభ్య పదజాలంతో వస్తున్నాయి.. హీరోలు కూడా చెడు మాటలు మాట్లాడుతున్నారని వెంకయ్య నాయుడు చురకలు వేశారు. కానీ నాటకంలో బాషా చాలా బావుంటుందని.. స్వతంత్ర సమయంలో నాటకాలే ప్రజల్లో స్ఫూర్తిని నింపాయని ప్రశంసలు కురిపించారు. నాటకాలు చూసే వారు ఎందరో ఉన్నారన్నారు. సినిమా ప్రభావం వల్ల నాటకాలు మనుగడ కోల్పోతున్నాయని.. ప్రభుత్వం చేయిత అందిస్తే పోటీ ప్రపంచంలో నాటకాలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.