టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన చిత్రం `మురారి`. తెలుగులో సోనాలి బింద్రేకు ఇదే తొలి చిత్రం కాగా.. కైకాల సత్యనారాయణ, సుకుమారి గొల్లపూడి మారుతీరావు, రఘుబాబు, లక్ష్మి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించారు. మెలోడీ శర్మ సంగీతం అందించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకున్న మురారి మూవీ.. 2001 ఫిబ్రవరి 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకుంది. అయితే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో మురారి సినిమాను వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ చేశారు. మూడు రోజులు ప్రదర్శించబడిన మురారి మూవీ రీరిలీజ్ లోనూ టాప్ లేపింది. టాలీవుడ్ చరిత్ర ఆల్ టైం అత్యధిక వసూళ్లు సాధించిన రీ రిలీజ్ మూవీగా రికార్డును సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 4.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిన మురారి మూవీ.. రెండో రోజు రూ. 1.76 కోట్లు, మూడో రోజు రూ. 85 లక్షలు సొంతం చేసుకుంది. మొత్తంగా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 8.31 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు తెలుగు రీ-రిలీజ్ల్లో అత్యధిక కలెక్షన్ల రికార్డు పవన్ కళ్యాణ్ హీరో చేసిన ఖుషి మూవీ పేరిట ఉంది. రీ రిలీజ్ లో ఖుషి మూవీ రూ.7.46 కోట్లు వసూల్ చేయగా.. ఇప్పుడు మురారి ఆ రికార్డును బ్రేక్ చేసి అగ్ర స్థానంలో కూర్చుంది.