ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రత్యేకంగా అధీకృత సంబంధాలు ఏమీ లేవు. ఎవరికి వారు గానే ఉన్నాయి. ఉంటాయి కూడా. ఈ ఏడాది జూన్ 2తో ఉమ్మడి రాజధాని అనే మాట కూడా పోయింది. దీనికి కొనసాగించేందుకు, లేదా పునరుద్ధరించిమరో 10ఏళ్ల పాటు ఉంచేలా కూడా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
దీంతో ఉమ్మడి రాజధాని అనే మాట లేకుండా పోయింది. ఇది సాధారణంగా ఉంటే ఎంత? లేక పోతే.. ఎంత? ఎవరికి కావాలి? అనే మాట సహజంగా వినిపిస్తుంది. కానీ, కొన్ని రంగాలను, మరికొన్ని వర్గాలను తీసుకున్నప్పుడు.. ఉమ్మడి రాజధాని ప్రాధాన్యం లేదా.. హైదరాబాద్ విలువ తెలుస్తాయి. ఉదాహరణకు ఏపీలోని గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన యువత.. హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో క్యాబులు నడుపుతున్నారు.
అదేవిధంగా అనేక మంది విద్యార్థులు.. పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు. ఇక, చిరు వ్యాపారాలు చేసుకునేవారు కూడా.. సమీప జిల్లాల నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. అయితే.. నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పోయిన నేపథ్యంలో వీరికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. తమ తమ ప్రాంతంలో పోటీ ఇస్తున్నారన్న కారణంగా క్యాబ్ డ్రైవర్లను తెలంగాణకు చెందిన డ్రైవర్లు తరిమి కొడుతున్నారు. విద్యార్థుల పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు.
సో.. ఇలాంటి సమస్యలు ఇప్పుడు జనసేన అధినేత, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రజాద ర్బార్లో వెలుగు చూశాయి. దీంతో ఆయన నేరుగా క్యాబ్ డ్రైవర్లకే విజ్ఞప్తులు చేశారు. అయ్యా.. కొన్నాళ్లు ఏపీ క్యాబ్ డ్రైవర్లను కూడా హైదరాబాద్లో వ్యాపారం చేసుకోనివ్వండి.. తర్వాత.. ఏపీలో రాజధాని ఏర్పడుతుంది.. దీంతో ఇక్కడే ఉపాధి వస్తుందని ఆయన విన్నవించే పరిస్థితి వచ్చింది. అయితే.. ఇలా క్యాబ్ డ్రైవర్లను కాకుండా.. నేరుగా ప్రభుత్వం-ప్రభుత్వం చర్చలు జరిపితే బాగుంటుందని క్యాబు డ్రైవర్లు చెబుతున్నారు.