ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు దేశపు అత్యున్నత న్యాయస్థానం పచ్చ జెండా ఊపింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
చరిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు తీర్పునకు అనుగుణంగానే ఏబీసీడీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బి సి డి వర్గీకరణ చేపడుతుందని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అంతేకాకుండా అవసరమైతే ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ లో కూడా అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామని సభా ముఖంగా రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఏడుగురు జడ్జిలతో కూడిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ లో ఆరుగురు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చారని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆ బెంచ్ న కు తమ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని రేవంత్ అన్నారు. మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఆ క్రమంలోనే ఈ వర్గీకరణ చర్చలో పాల్గొని మిగతా సభ్యులంతా ఈ వ్యవహారంపై ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలపాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మిగతా సభ్యులందరూ ఇందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.