తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సభలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య మాటలుతూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి అవమానించారంటూ హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చిన బీఆర్ఎస్ నేతలు… రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వెనకాల ఉన్న అక్కలు మోసం చేస్తారని, గతంలో తనను మోసం చేసే ఇప్పుడు మీ వెనక కూర్చున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి అవమానించారని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుందని, దానిపై మాట్లాడేందుకు మైక్ ఇస్తామని స్పీకర్ చెప్పారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని వారు అక్కడే కూర్చున్నారు. ఈ క్రమంలోనే మార్షల్స్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు.
ఆ తర్వాత అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు, కేటీఆర్ లతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. సీఎం డౌన్ డౌన్, మహిళా ఎమ్మెల్యేలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని వ్యాన్ లో ఎక్కించి అక్కడ నుంచి తీసుకువెళ్లారు.