దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన హిస్టారికల్ వండర్ `మగధీర` విడుదలై నేటికి 15 ఏళ్లు. డెబ్యూ మూవీ చిరుత తర్వాత రామ్ చరణ్ చేసిన రెండో చిత్రమిది. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్, ప్రతినాయకుడిగా దేవ్ గిల్, మరో ముఖ్యమైన పాత్రలో శ్రీహరి నటించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. పునర్జన్మ మరియు శాశ్వతమైన ప్రేమ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మగధీరను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దాదాపు రూ. 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అప్పటికి టాలీవుడ్ లో అదే టాప్ బడ్జెట్ కావడం విశేషం.
2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా చలామణి అవుతున్న `పోకిరి` రికార్డులను బద్దలు కొట్టింది. తొలి ఆట నుంచే హిట్ టాక్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్ లో రూ. 72 కోట్ల షేర్, రూ. 128 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా 1250 థియేటర్లలో 625 డిజిటల్ యుఎఫ్ఓ మూవీజ్ ప్రింట్లతో మగధీరను రిలీజ్ చేశారు. ఒక తెలుగు సినిమాకి ఇది అతిపెద్ద విడుదలగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోనే 1000 కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదల అయింది. అమెరికాలో 21 స్క్రీన్లలో రిలీజ్ అయిన తొలి తెలుగు సినిమాగా మగధీర నిలిచింది.
అలాగే మగధీర మూవీలో హీరోయిన్ గా మొదట తమన్నా పేరును పరిశీలించారు. కానీ చివరకు కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. లక్ష్మీ కళ్యాణం తర్వాత యమదొంగలో ఆమెను కథానాయికగా తీసుకోవాలని రాజమౌళి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో కాజల్ అందుబాటులో లేదు. దాంతో కాజల్ ను మగధీరలో హీరోయిన్ గా తీసుకున్నారు రాజమౌళి.
మగధీర విడుదల తర్వాత కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో రామ్ చరణ్ కు భారీ స్టార్డమ్ లభించింది. దేవ్ గిల్ ఈ చిత్రం తర్వాత అనేక దక్షిణ భారతీయ చిత్రాల్లో ప్రతినాయకుడిగా పనిచేశాడు. రాజమౌళి టాలీవుడ్ లో నెం.1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
మగధీర సినిమా 223 సెంటర్లలో 100 రోజులు ఆడింది. మూడు కేంద్రాలలో 175 రోజుల రన్ పూర్తి చేసుకుంది.కర్నూలులోని విజయలక్ష్మి థియేటర్లో 1000 రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. 57వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ కొరియోగ్రఫీ మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్‌ల విభాగంలో మగధీర మూవీకి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. అలాగే పలు విభాగాల్లో ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు తొమ్మిది రాష్ట్రాల నంది అవార్డులను గెలుచుకుంది. ఇక హిందీలోకి అదే పేరుతో, తమిళంలో మావీరన్గా మరియు మలయాళంలోకి ధీర : ది వారియర్‌గా మగధీరను డబ్ చేసి 2011లో విడుదల చేయగా.. తమిళ్, మలయాళ డబ్బింగ్ వెర్షన్లు విజయవంతమయ్యాయి. మరియు రామ్ చరణ్‌కు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.