మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలోని భూకబ్జాలు, ఆక్రమణలు బయటపడతాయన్న ఉద్దేశంతో ఆ ఫైళ్లను కావాలని తగలబెట్టి అగ్నిప్రమాదంగా చిత్రీకరించారని ఊహాగానాలు వస్తున్నాయి. అది అగ్నిప్రమాదం కాదని, కావాలని తగలబెట్టారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోని ఈ వ్యవహారంలో ఒక కానిస్టేబుల్ తో పాటు మరికొందరిపై చర్యలు కూడా తీసుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. ఆ ఫైళ్ళ దగ్ధం కేసులో వైసిపి మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా పై పోలీసులు కేసు నమోదు చేసిన వైనం సంచలనం రేపుతుంది. నవాజ్ భాషా నివాసంలో పోలీసులు నోటీసులు అంటించారు. రెవెన్యూ శాఖకు చెందిన ఫైళ్లు నవాజ్ భాషా దగ్గరున్నాయని, అందుకే ఆయనపై కేసు పెట్టామని డిఐజి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇక, ఈ ఘటనలో మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేశామని ఫోరెన్సిక్ నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇక, పెద్దిరెడ్డి మాధవరెడ్డి నివాసంలో 500 ఫైళ్లు దొరికాయని, పెద్దిరెడ్డి పీఏ శశిధర్, తుకారం నివాసంలో కూడా అనేక కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇక, నిన్న పెద్దిరెడ్డి బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బారులు తీరిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే భూ అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని ప్రవీణ్ కుమార్ అన్నారు.