ఇటీవల విడుదలైన సోషియో ఫాంటసీ మూవీ.. కల్కి సినిమా గురించి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కి.. అతి భారీ విజయం నమోదు చేసి అంతకన్నా భారీగా వసూళ్లు సాధిస్తున్న మూవీగా పేరు తెచ్చు కుంది. దీనిలో కొన్ని డైలాగులు మాస్ జనాల నోళ్లలో అలవోకగా అలవాటయ్యాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర `సుప్రీం యాస్మిన్` పరిచయం.. ఓ చిన్న డైలాగుతో ప్రారంభం అవుతుంది.
“ఈ సృష్టిలో మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. మారడు-మారలేడు“ అనే డైలాగ్లో కమల్ యాక్షన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు దీనిని ఏపీ మాజీ సీఎం జగన్కు అన్వయించి మాస్ జనాలు ఆడేస్తున్నా రు. ఏ ఇద్దరు కలిసినా.. ఏ నలుగురు టీ కొట్ల దగ్గర గుమిగూడినా సరే.. “జగన్ మారడు-మారలేడు“ అనే మాట వినిపిస్తుండడం గమనార్హం. ఇదేమీ జోక్ కాదు. పట్టణాల నుంచి పల్లెల వరకు కూడా.. ప్రజలు అనేక రూపాల్లో చర్చించుకుంటుండడం విశేషం.
రెండు కీలక విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 1)పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం. పార్టీని ఇప్పటి వరకు గాడిలో పెట్టేందుకు ప్రయత్నించకపోవడం. 2) జననేతగా గుర్తింపు తెచ్చుకునేందుకు తహతహ లాడిన జగన్.. జనాలను పట్టించుకోకపోవడం. గోదావరికి పోటెత్తిన వరదల కారణంగా ఇప్పుడు అనేక ప్రాంతాల్లో, జిల్లాల్లో కూడా వరద ప్రభావిత ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇప్పటికీ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. కనీసం వారిని పన్నెత్తు పలకరించేందుకు, నేరుగా వెళ్లి పరామర్శించేందుకు కూడా జగన్ సాహసించడం లేదు.
ఇక, పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు, వివాదాలు వస్తున్నా.. వాటిని కూడా జగన్ పట్టించుకోకపోవడం… నాయకులతో మాట్లాడకుండా తన మానాన తను ఉండడం. ఈ పరిణామాలకు తోడు.. మొండి వైఖరి! జరిగిపోయింది.. ఎలానూ జరిగిపోయింది. ఎన్నికలు ఇప్పట్లో రావు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లి.. గౌరవంగా వ్యవహరిస్తే.. ప్రజలు పట్టించుకునే అవకాశం.. సానుభూతి పెంచుకునే అవకాశం మెండుగా ఉంటాయి. కానీ, ఆయన మంకు పట్టు.. మాత్రం వీడడం లేదు. సో.. ఈ పరిణామాలపైనే.. “జగన్- మారడు.. మారలేడు“ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.