మాస్ మహారాజా రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయని గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మీ తాజాగా చేసిన పని మరింత బలాన్ని చేకూర్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లైగర్ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి చేసిన లేటెస్ట్ మూవీ `డబుల్ ఇస్మార్ట్`.
2019లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఇది. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుందని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. వరుస అప్డేట్స్ తో ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. అయితే సడెన్ గా ఆగస్టు 15 బరిలో `మిస్టర్ బచ్చన్` వచ్చి చేరింది.
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మిస్టర్ బచ్చన్ మూవీని కూడా ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు గత వారం మేకర్స్ ప్రకటించారు. ఇదే ఇప్పుడు రవితేజ, పూరీ మధ్య విభేదాలకు కారణమైంది. వాస్తవానికి రవితేజను స్టార్ హీరోగా చేసింది పూరీనే. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలాగే హరీష్ శంకర్ పూరీ జగన్నాథ్ వద్ద శిష్యరికం చేసే డైరెక్టర్ అయ్యారు.
అలాంటి హరీష్ శంకర్, రవితేజ కలిసి పూరీ సినిమాకే పోటీగా తమ సినిమాను దింపుతున్నారు. దీంతో రవితేజ, పూరీ జగన్నాథ్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వైరల్ అవుతున్నారు. ఇదే తరుణంలో తాజాగా ఛార్మీ సోషల్ మీడియాలో రవితేజతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ ను అన్ ఫాలో చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు మరింత బలం చేకూరింది.