ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయని.. వాటిని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమికి కూడా జగన్ ఆహ్వానం పంపారు. ఎన్డీఏ కూటమి ఎటువంటి రెస్పాన్స్ రకపోగా.. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు జగన్ ధర్నాకు మద్దతు తెలిపారు.
అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో.. తాను చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని జగన్ కోరారు. ఈ విషయంపై తాజాగా ఏపీ కాంగ్రస్ చీఫ్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. జగన్ కు సూటి ప్రశ్నలు వేశారు. `జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..?` అంటూ షర్మిల ప్రశ్నించారు.
అక్కడితో ఆగలేదు.. `5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా?
వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం..? మీ నిరసనలో స్వలాభం తప్పా నిజం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు` అంటూ షర్మిల సెటైర్లు పేల్చారు. మరి సోదరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము జగన్ కు ఉందా? లేదా? అన్నది చూడాలి.