ఏపీలో మరో రెండు మాసాల తర్వాతే బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిం చారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్న ఆయన.. ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని సూచించారు. కనీస ఖర్చులకు కూడా అప్పులు చేసే పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దిగజార్చిందన్నారు. అందుకే.. ఇప్పుడు రాష్ట్రం బీహార్, ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాలతో పోటీ పడాల్సి వచ్చిందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బడ్జెట్ను ప్రవేశ పెట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఆర్థిక అంశాలపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉందని.. కానీ, సాధ్యం కావడం లేదన్నారు. ఈ సమయంలో కొన్ని వివరాలను ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని.. మరోవైపు ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.
అప్పులు చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం తనకు ఇష్టం లేదన్న చంద్రబాబు.. స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అమలు చేస్తామని చెప్పారు. వచ్చే రెండు మాసాల కాలం లో సంపద సృష్టించే దిశగా అడుగులు వేయనున్నట్టు తెలిపారు. అప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. ఇది తప్పుకాదని చంద్రబాబు పేర్కొన్నారు. అవకాశం లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. వచ్చే రెండు మాసాల తర్వాత.. పూర్తిస్థాయి బడ్జెట్(5మాసాలకు) తీసుకురానున్నట్టు వివరించారు.