రాష్ట్రంలో వచ్చే ఏడు మాసాల కాలానికీ.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉందని.. అయితే.. చంద్ర బాబు భయపడుతున్నారని అందుకే మళ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసమే వెళ్తున్నారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. రెండు రకాలుగా చంద్రబాబులో భయం కనిపిస్తోందని చెప్పారు. వైసీపీ చేసిన అప్పులపై ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. బడ్జెట్ కనుక ప్రవేశ పెడితే.. వాస్తవాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. వైసీపీ హయాంలో 14 లక్షల కోట్ల వరకు అప్పులు చేశామని బాబు చెప్పారని తెలిపారు.
అయితే.. రాజకీయాల్లో ఎన్నయినా.. చెప్పుకోవచ్చని.. కానీ, బడ్జెట్ ప్రతిపాదనలకు వచ్చేసరికి వాస్తవాల ను చూపించాల్సి ఉంటుందని అందుకే బాబు బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. బడ్జెట్ ప్రతుల్లో వాల్యూమ్ 5, 6లలో గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందన్నారు. గతంలో తాము ఇదే పద్ధతి పాటించామని.. కానీ, ఇప్పుడు ఈ వాస్తవాలు చెప్పేందుకు.. బాబు ఇష్టపడడం లేదన్నారు.
వాస్తవ అప్పు 5.2 లక్షల కోట్లు కావడంతో.. దీనిని బడ్జెట్లో పేర్కొనాల్సి రావడంతో.. తాము చేసిన 14 లక్షల కోట్ల అప్పు ప్రచారం రివర్స్ అవుతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ఇక, సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకు కూడా.. ఈ మార్గాన్ని ఎంచుకున్నారని జగన్ విమర్శించారు. తాము రూ.100 కోట్లతోనే 2019లో అధికారం చేపట్టామని జగన్ చెప్పారు. అయినా.. కూడా పూర్తిస్థాయి బడ్జెట్ను జూలై 12నే ప్రవేశ పెట్టామన్నారు.కానీ, చంద్రబాబు మాత్రం తాను అధికారం చేపట్టేనాటికి ఖజానాలో 8 వేల కోట్ల రూపాయలు ఉన్నా.. బడ్జెట్ను ప్రవేశ పెట్టడం లేదని జగన్ విమర్శించారు.
దేశంలో ఎక్కడా కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ.. ఇలా బడ్జెట్ను ప్రవేశ పెట్టకుండా కాలం వెళ్ల దీయలేదన్నా రు. కేవలం వైసీపీపై జల్లిన బురదను ఇప్పుడు తన చేతులతో తనే తుడవాల్సి ఉంటుందన్న కారణంగా .. బడ్జట్ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారని చెప్పారు. ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్తా మని జగన్ వివరించారు.