ఏపీలో గత నాలుగు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. గత వైకాపా పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను వివరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నందమూరి బాలకృష్ణ డుమ్మా కొట్టేశారు. హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా ఆయన మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విన్నర్ గా పేరు తెచ్చుకున్న బాలయ్యకు కచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. పదవి దక్కకపోవడం వల్లే బాలయ్య అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారని ప్రచారం మొదలైంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా స్పష్టమైంది.
పదవుల కోసం పాకులాడే వ్యక్తి బాలయ్య కానే కాదు. ఏపీలో ఎన్నికల కారణంగా బాలయ్య షూటింగ్స్ నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. దీని కారణంగా బాబీ డైరెక్ట్ చేస్తున్న `ఎన్బీకే 109` మూవీకి బ్రేక్ పడింది. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాలయ్య దర్శకనిర్మాతలకు ఇచ్చిన కమిట్మెంట్ నేపథ్యంలో ఆ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఎన్బీకే 109 సినిమాకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుండగా.. అక్కడి జైపూర్ ప్యాలెస్ లో బాలయ్య బిజీ బిజీగా ఉన్నారు. అందుకే ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఇందుకు ఆయన ముందే పర్మీషన్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది.