“మీ ప్రాంతంలో మీ భూముల ఎవరైనా కబ్జా చేశారని అనుకుంటే.. నిర్భయంగా మీరు ఫిర్యాదులు చేయొ చ్చు. ఉన్నతాధికారులే మీ ఫిర్యాదులు తీసుకుంటారు“ ఇదీ.. బుధవారం రాత్రి.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఉన్నతాధికారులు స్థానిక మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటన. నిజానికి ఉన్నతాధికారుల ఉద్దేశం.. మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన `అగ్గి` ఘటనకు సంబంధించి బాధితులు ఎవరైనా వస్తారేమో.. వివరాలు తెలుస్తాయేమో.. అని అనుకున్నారు.
ఇలా ప్రకటన ఇచ్చిన తర్వాత.. అధికారులు కూడా పెద్దగా దానిపై దృష్టి పెట్టలేదు. ఎందుకంటే.. ఎవరూ రారు.. ఎవరు ఫిర్యాదు చేయరు.. అని స్థానిక పోలీసులు నూరి పోశారు. అయినా.. నిబంధనల ప్రకారం ప్రకటనిద్దాం.. అంటూ ఓ ప్రకటన పడేశారు. అంతే.. గురువారం ఉదయం 7 గంటల నుంచే బాధితులు క్యూ కట్టారు. ఒక్క మదనపల్లె పరిధిలోనే వందల కొద్దీ ఫిర్యాదులు వచ్చాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అందరి ఫిర్యాదులోనూ దాదాపు ఒక్కటే మాట.
“వైసీపీ నాయకులు/ అనుచరులు.. మా భూములు దోచేశారు. మా ఇళ్లు లాగేసుకున్నారు. మా పొలాలు కలిపేసుకున్నారు. మా సరిహద్దులు కూల్చేశారు. మా గుడెసెలు లాగి పడేసి.. విల్లాలు కట్టుకున్నారు“ ఇలా.. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఎవరి బాధ వారిది కావొచ్చు. కానీ సారాంశం మాత్రం ఇదే. దీంతో రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మదనపల్లె కేసును నిశితంగా పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా నియమించిన అధికారి ఆర్ పీ సిసోడియా నోరు వెళ్ల బెట్టారు.
సహజంగా సిసోడియా సీరియస్ అధికారి. ఆయన ఎక్కువగా మాట్లాడరు. కానీ, ఆయనే మీడియాను పిలిచి మరీ.. “అసలు ఫిర్యాదులు ఉండవనుకున్నాం. మహా వస్తే.. పదో పరకో వస్తాయనుకున్నాం. కానీ, గుట్టలు గుట్టలుగా ఫిర్యాదులు అందాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది“ అని వ్యాఖ్యానించారు. వీటిని చాలా సీరియ స్గా తీసుకుంటామని.. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని.. సాధ్యమైనంత వేగంగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
కట్ చేస్తే..
వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోయిందో.. 2019లో జగన్ను ఏరికోరి ఎన్నుకున్న ప్రజలు ఎందుకు బుట్టదాఖలు చేశారో.. మదనపల్లె ఘటన చెబుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఒక్క మదనపల్లెలోనే ఇలాంటి కేసులు ఇన్ని వస్తే.. ఇక, విశాఖ, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, గుంటూరు వంటి జిల్లాల్లో ఎన్ని వేల కేసులు ఉన్నాయో.. ఎంత మంది కసితో రగిలిపోతున్నారో.. అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి జగన్కు ఈ విషయాలు తెలుస్తున్నాయా? అనేది సందేహం.