ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ అనుకున్నంత మేర కళకళలాడట్లేదన్నది వాస్తవం. సంక్రాంతికి ‘హనుమాన్’.. ఆ తర్వాత వేసవిలో ‘టిల్లు స్క్వేర్’.. ఈ మధ్య ‘కల్కి’ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మేర సందడి చేశాయి. ‘కల్కి’ రిలీజ్కు కొన్ని వారాల ముందు, తర్వాత కొన్ని వారాలు ఏ సినిమా సరిగా ఆడలేదు. జూన్ నెలాఖరులో ‘కల్కి’ వచ్చాక నెల రోజులు గడిచాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
‘ఇండియన్-2’ సహా అన్నీ డిజాస్టర్లే అయ్యాయి. గత వారం వచ్చిన ‘డార్లింగ్’ సహా ఏ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక ఈ వారం నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నా.. అందులో చాలా వరకు నామమాత్రపు రిలీజ్ల మాదిరే కనిపిస్తున్నాయి. ఉన్నంతలో తమిళ అనువాద చిత్రం ‘రాయన్’కే కొంచెం బజ్ కనిపిస్తోంది.
‘రాయన్’ సినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాదు.. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ధనుష్ ప్రతిభావంతుడైన దర్శకుడని తొలి చిత్రం ‘పవర్ పాండి’తోనే రుజువైంది. పైగా సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీని ప్రోమోలు ఆకట్టుకున్నాయి. తెలుగు యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఇందులో కీలక పాత్ర చేయడం కూడా మన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ గొప్పగా ఏమీ లేవు.
కానీ, టాక్ బాగుంటే కలెక్షన్లు బాగానే ఉండే అవకాశముంది. దీంతో పాటుగా రాజ్ తరుణ్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘పురుషోత్తముడు’తో పాటు పలాస హీరో రక్షిత్ నటించిన ‘ఆపరేషన్ రావణ్’ లాంటి సినిమాలు రిలీజవుతున్నాయి. వీటికి ఏమాత్రం హైప్ కనిపించడం లేదు. మినిమం బజ్ లేకుండా వస్తున్న ఈ చిత్రాలు టాక్ బాగుంటే తప్ప ప్రేక్షకుల దృష్టిలో పడడం కష్టమే.