ఏపీలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 50 రోజులైనా గడవలేదు. ఈలోపే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రభుత్వం విఫలమైందని విపక్ష వైసీపీ ప్రచారం షురూ చేసింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఓవైపు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. వాటికి ఎగ్గొట్టి మరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి ఢిల్లీలో నిరసనకు దిగారు.
రాష్ట్రంలో ఏదేదో జరిగిపోతుంది.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది.. రెడ్ బుక్ అంటూ జగన్ ఢిల్లీలో తెగ హడావిడి చేస్తున్నారు అయితే ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాపై తాజాగా అసెంబ్లీ వద్ద మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి జగన్ ధర్నా చేస్తుంది రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో కాదని.. ఆ సాకుతో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకోవడం కోసమని పయ్యావుల వ్యాఖ్యానించారు.
జగన్ ఢిల్లీ వెళ్లడం వెనక సీక్రెట్ అదే అంటూ పయ్యావుల ఎద్దేవ చేశారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇకనైనా అసెంబ్లీకి రావాలని సూచించారు. శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలో గగ్గోలు పెడుతున్న మాజీ సీఎం గారికి మంచి అవకాశం వచ్చిందని.. వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని పయ్యావుల అన్నారు. 36 రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలను జగన్ సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు కాబట్టి.. ఆ చర్చల్లో జగన్ పాల్గొనాలని మంత్రి పయ్యావుల తెలిపారు.