తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నకిలీ ఓటర్ల డ్రామాకు వైసీపీ తెరదించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. పుంగనూరు, పలమనేరు, కడప నుంచి వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో బస్సులు, కారుల్లో తిరుపతికి దొంగ ఓటు వేసేందుకు చేరుకున్నారని టీడీపీ నేతలు….ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, కొందరు దొంగ ఓటర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ క్రమంలోనే 67 ఏళ్ల వయసులో టీడీపీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా దొంగఓట్లు వేయటానికి వచ్చిన వారిని హడలెత్తించారు. రోడ్డుపై ఎండలో బైఠాయించి పోలింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేస్తూ దొంగ ఓటర్లకు చుక్కలు చూపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దొంగ ఓటర్లను ఏరి పారేసిన సుగుణమ్మ… పెద్దిరెడ్డికి, చెవిరెడ్డికి, భూమన కరుణాకర రెడ్డికి చెమటలు పట్టించిన వైనంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ వయసులో మీరు చూపిన ఉత్సాహం, తెగువకు మీకు వందనం అమ్మ అంటూ టీడీపీ కార్యకర్తలు సుగుణమ్మకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఓ దొంగ ఓటరు తన ఇంటి పేరు చెప్పడానికి ఇబ్బందిపడడంతో… బాగానే ట్రైనింగ్ అయ్యాడు గాని ఇంటి పేరు మర్చిపోయాడు వెధవన్నర వెధవ అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ జరగనంత స్వేచ్ఛగా, ప్రశాంతంగా తిరుపతిలో ‘బస్ పోల్స్’ జరిగాయంటూ తెలుతు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు, ఆర్‌ఆండ్‌బీ గెస్ట్‌హౌస్ దగ్గర దొంగ ఓటర్లను పట్టుకునేందుకు వచ్చిన సుగుణమ్మను వైసీపీ నేతలు దుర్భాషలాడారు. ‘అసలు నీకు ఇక్కడ పని ఏంటీ. ఎవరే నువ్వు’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దురాగతాన్ని వీడియో తీసిన ఏబీఎన్ ప్రతినిధినీ వైసీపీ నేతలు తిట్టారు. బలవంతంగా అతడి సెల్‌ఫోన్ లాక్కుని వీడియోను డిలీట్ చేశారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయం ముందు 40 మందితో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్ వాహనాన్ని సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ అడ్డుకొని ఎస్పీకి ఫిర్యాదు చేసి ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
అంతకుముందు, తిరుపతిలోకి దాదాపు లక్షమంది స్థానికేతరులను వైసీపీ నాయకులు తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని సుగుణమ్మ ఆరోపించారు. పీఎల్ఆర్ కన్వెన్షన్ వద్ద దొంగ ఓటర్లను తాను ప్రశ్నించగా పాస్‌పోర్టు కోసమని కొందరు, ఆస్పత్రికి వచ్చామని మరికొందరు అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. జగన్ ఆదేశాలతో వేలాది మందితో దొంగ ఓట్లు వేయించారని సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆమె ఆరోపించారు.