సాంకేతిక సమస్యలు సాధారణమే కానీ.. దిగ్గజ సంస్థలు అందించే సేవలకు అంతరాయం కలగటం చాలా అరుదైన అంశం. టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడిన వేళ.. ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ సమస్య ప్రపంచానికి ఎంతటి ఇబ్బందులకు గురి చేస్తుందన్న విషయం తాజా మైక్రోసాఫ్ట్ ఎపిసోడ్ లో అందరికి మరోసారి అర్థమైంది. విండోస్ లో బ్లూస్క్రీన్ ఎర్రర్ కారణంగా పలు దేశాల్లోని విమానయాన సేవలు.. బ్యాంకింగ్.. స్టాక్ మార్కెట్ తో సహా పలు వాణిజ్య సంస్థల కార్యకలాపాలకు ఆటంకం వాటిల్లింది.
దీంతో.. ఒక్కసారిగా కోట్లాది మంది ప్రభావితమయ్యారు. మరేం చేయలేనట్లుగా దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఉన్నపళంగా తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. దీని కారణంగా పలు కంప్యూటర్లు షట్ డౌన్ కావటం రీస్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగా లోడ్ కాలేదు.. మరోసారి రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాలన్న సందేశాన్ని చూపిస్తూ కంప్యూటర్లు స్ట్రక్ అయిపోయాయి.
ఎందుకిలా జరిగింది? అన్న దానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే సమాధానం ఇచ్చింది. ఇటీవల వారు చేపట్టిన క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని చెప్పింది. ఇంతకూ ఈ క్రౌడ్ స్ట్రయిక్ అన్నదేంటి?అంటే.. అదో సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్ తో పాటు వివిధ సంస్థలకు అత్యాధునిక సెక్యూరిటీని ఇస్తుంటుంది. ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన అప్డేట్ విండోస్ పని తీరును ప్రభావితం చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజినీర్లు పని చేస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
దీని కారణంగా సాఫ్ట్ వేర్ తో పాటు హార్డ్ వేర్ సమస్యలు తలెత్తే పరిస్థితి. దీంతో.. ఈ సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై మైక్రోసాఫ్ట్ ఒక సూచన చేసింది. తాము చెప్పినట్లు చేస్తే క్రౌడ్ స్ట్రైక్ తాజా అప్డేట్ తో ఏర్పడిన ఇబ్బందిని అధిగమించే వీలుందని చెప్పింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలన్నది చూస్తే..
– సిస్టంను సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్ లో ఓపెన్ చేయాలి.
– c:\windows\system32\drivers\crowdstrike అనే డైరెక్టరీలోకి వెళ్లాలి.
– అందులో c-00000291*.sys అనే ఫైల్ ఉంటే.. దాన్ని తక్షణం డిలీట్ చేయాలి.
– ఆ తర్వాత ఎప్పటిలా సిస్టమ్ ను బూట్ చేయాలి.
– ఇలా చేస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఒకవేళ అప్పటికి సమస్య పరిష్కారం కాకుంటే విండోస్ అప్డేట్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. సో.. మీకు బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇష్యూ వస్తే.. ఈ విధంగా ఒకసారి ప్రయత్నించండి.