పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులేమో అట్లీ దర్శకత్వంలో సినిమా అన్నారు.. ఇటీవలేమో జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఎప్పుడో ఫిక్స్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సంగతేంటి అని అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.
ఐతే కచ్చితంగా బన్నీ తర్వాతి చిత్రంగా త్రివిక్రమ్ మూవీనే ఉంటుందో లేదో కానీ… వాళ్లు చేయబోయే సినిమాకు స్టోరీ లైన్ మాత్రం ఓకే అయిపోయినట్లు వెల్లడైంది. బన్నీ ఆప్తమిత్రుడు.. త్రివిక్రమ్‌తో బన్నీ చేయబోయే సినిమాలో నిర్మాణ భాగస్వామి కూడా అయిన బన్నీ వాసు.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ఆయ్ మూవీ ప్రమోషన్లలో బన్నీ-త్రివిక్రమ్ మూవీ గురించి వాసు మాట్లాడాడు.
ముందు నుంచి చెబుతున్నట్లే త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని బన్నీ వాసు చెప్పాడు. త్రివిక్రమ్ నుంచి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదని.. ఆయనకు ఆ కెపాసిటీ ఉందని బన్నీ ఎప్పట్నుంచో నమ్మేవాడని.. దాని స్పాన్, బడ్జెట్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయని బవాసు తెలిపాడు. వీరు చేయబోయే కొత్త సినిమాకు సంబంధించి కథ గురించి కొంత కాలంగా చర్చించుకుంటున్నారని టాక్.
బేసిక్ స్టోరీ లైన్ అయితే అయిపోయిందని.. దాన్ని కథ అనడం కంటే కాన్సెప్ట్ అని చెప్పొచ్చని వాసు అన్నాడు. ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ మాత్రమే ఏడాది నుంచి ఏడాదిన్నర అవుతుందని.. బడ్జెట్ ఊహించని స్థాయిలో అవుతుందని వాసు చెప్పాడు. అంతా ఓకే అనుకున్నాక బడ్జెట్ కోసం నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులిద్దరూ ఫైనాన్షియర్ల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం చూడబోతున్నట్లు బన్నీ వాసు తెలిపాడు.