ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప 2 మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్ కంప్లీట్ గా కాకపోవడం వల్ల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయని గత నాలుగైదు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుకుమార్ పై కోపంతో అల్లు అర్జున్ తన గడ్డం తీసేసి ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ కి వెళ్ళిపోయాడని.. దాంతో హర్ట్ అయిన సుకుమార్ కూడా పుష్ప 2 పనులన్నీ వదిలేసి అమెరికా వెళ్లాడంటూ జోరుగా వార్తలు వచ్చాయి.
వాళ్లు విదేశాలకు వెళ్తున్న ఫోటోలు కూడా బయటకు రావడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బన్నీ వాసు మీడియాతో ముచ్చటించారు. రిపోర్టర్స్ అల్లు అర్జున్-సుకుమార్ మధ్య క్లాషెస్ నిజమేనా? అని ప్రశ్నించగా బన్నీ వాసు రియాక్ట్ అయ్యారు.
`నిజంగా మేము ఆ వార్తలు చూసి నవ్వుకున్నాం.. ఫ్రీ పబ్లిసిటీ లా అనిపించింది. బన్నీకి సంబంధించి క్లైమ్యాక్స్, ఒక సాంగ్ పెండింగ్ ఉంది. మరో 15, 17 రోజులు షూటింగ్ చేస్తే అతని పార్ట్ పూర్తవుతుంది. ఫహాద్ ఫాజిల్ వర్క్ ఎక్కువ ఉండిపోయింది. ప్రస్తుతం సుకుమార్ గారు ఎడిటింగ్, ఇతర ప్యాచ్ వర్క్ లపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఆగస్టు తొలి వారంలో షూటింగ్ రీస్టార్ట్ అవుతుంది. అందుకే ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఇటలీ వెళ్లారు. ఇదేమి తెలియని జనాలు వాళ్లను అపార్థం చేసుకుని ఇష్టం వచ్చినట్లు రూమర్స్ సృష్టించారు. గడ్డం తీసినందుకు నానా బీభత్సం చేశారు. వాస్తవానికి సుకుమార్ అంటే బన్నీకి ఓ ఎమోషన్. వాళ్లది ఒక ప్రత్యేకమైన బంధం. సుకుమార్ కోసం బన్నీ ఆరు నెలలైనా వెయిట్ చేస్తాడు. పుష్ప బ్రాండ్ ప్రాముఖ్యత వాళ్లకు తెలుసు` అంటూ ప్రొడ్యూసర్ బన్నీ వాసు చెప్పుకొచ్చారు. మొత్తానికి అల్లు అర్జున్ గడ్డం మిస్టరీ వీడింది. సుకుమార్ తో ఆయనకు ఎటువంటి గొడవలు లేవని స్పష్టమైంది.