తెలంగాణ రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో మరో వరాన్ని అందించారు. రూ. 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చుకుంటున్నారు. మూడు విడతల్లో రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ తొలి విడతలో రూ. లక్ష లోపు రైతు రుణాలు మాఫీ చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా పడ్డాయి.
ఈ నెలాఖరులోగా లక్ష నుంచి రూ.1.5 లక్షల మధ్య రుణాలను.. ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు ఉన్న రుణలను మాఫీ చేయబోతున్నారు. దీంతో తెలంగాణ రైతులు ఎంతో హుషారుగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వారి ముఖంతో ఆనందాన్ని ఆవిరి చేయడానికి సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. అమాయకులను మోసం చేయడానికి దొరికి ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు.. వాట్సాప్ నంబర్ల నుంచి ఆ పథకం లబ్ధిదారులకు బ్యాంకు లోగోతో ఉండే నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ మెసేజ్ లో ఉండే మోసపూరిత ఫైల్స్, లింక్‌లను పొరపాటున క్లిక్ చేశారో మీ డబ్బంతా గోవిందా. అలా చేయడం ద్వారా మీ ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతోంది. దాంతో వారు బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేసేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే ప్రజలను సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులతో నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయని.. పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయొద్దని చెబుతున్నారు.