చిన్న సినిమాల్లో.. అందునా హారర్ స్టోరీల్లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసి.. భారీ విజయాన్ని నమోదు చేయటమే కాదు.. కోట్లాది రూపాయిల కలెక్షన్లను సొంతం చేసుకున్న పొలిమేర మూవీ గురించి తెలిసిందే. ఇందుకు తగ్గట్లే పొలిమేర 1 విజయంతో పొలిమేర 2 తీయటం.. అది కూడా సక్సెస్ అయ్యింది. పొలిమేర 3ను నిర్మిస్తున్న సంగతిని ఇప్పటికే ప్రకటించారు.
దీనికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉంటే.. పొలిమేర 2 నిర్మించిన నిర్మాత మూడో భాగాన్ని తీస్తున్న నిర్మాతపై పోలీసు కేసు పెట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
2021లో మా ఊరి పొలిమేర మూవీ ఓటీటీలో నేరుగా రిలీజైంది. రెండో భాగాన్ని మాత్రం అందుకు భిన్నంగా తొలుత థియేటర్లలో విడుదల చేశారు. పొలిమేర 1 సక్సెస్ తో.. రెండో భాగాన్ని తీసిన మూవీకి నిర్మాతగా గౌరి క్రష్ణప్రసాద్ గా వ్యవహరించారు. నందిపాటి వంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. చిత్రాన్ని నిర్మించింది తానే కాబట్టి.. మూవీకి వచ్చిన లాభాల్లో షేర్ ఇవ్వాలని కోరితే చంపేస్తానంటూ వంశీ తనకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా గౌరి క్రిష్ణ ప్రసాద్ హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు.
పొలిమేర 2 విడుదల తర్వాత రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని డిస్ట్రిబ్యూట్చేసిన వంశీ.. లాభాల్లో తనకు రూపాయి కూడా ఇవ్వలేదంటూ గౌరి క్రిష్ణ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. తన మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తే చంపేస్తానని బెదరింపులకు దిగినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే.. తాజాగా నిర్మాణం
మొదలైన పొలిమేర 3 పార్టుకు నిర్మాతగా వంశీ వ్యవహరిస్తుండటం గమనార్హం. పోలీసుల చెంతకు చేరిన పొలిమేర నిర్మాత పంచాయితీ మరెక్కడి వరకు వెళుతుందో చూడాలి.