కాల జ్ఞానం రాసిన పోతులూరు వీర బ్రహ్మంగారి ఆస్తులను కూడా.. వైసీపీ నాయకులు దోచేయాలని స్కెచ్ వేశారని.. అదృష్టవశా త్తు ఆయనే వాటిని కాపాడుకున్నారని.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్రంలోని సహజ వనరులు, వైసీపీ హయాంలో వాటిని దోచుకున్న తీరుపై ఆయన శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు
విషయాలను వెల్లడించారు.
+ జగన్ హయాంలో సహజ వనరులు, అడవులు, ఖనిజ సంపద సర్వనాశనం చేశారు.
వైసీపీ నేతలు అన్నింటినీ దోచేశారు. దీని కోసం తమదైన శైలిలో `న్యూ పాలసీ` తీసుకువచ్చారు.
+ విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో భూకబ్జాలు చేశారు. జగనన్న పేరుతో చేపట్టి నవరత్నాల ఇళ్ల నిర్మాణం పథకంలో భాగంగా భూకబ్జా యథేచ్ఛగా సాగించారు.
+ ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయం పథకానికి వైసీపీ తెరదీసింది. ఈ క్రమంలో 23 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల పేరుతో భూముల అక్రమాలు చేశారు.
+ అడగడమే తడవుగా.. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములను రాసిచ్చేశారు. దీనికిగాను ఏకంగా చట్టాన్ని తీసుకువచ్చారు. `ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్` పేరుతో ప్రజల భూములు దోచేసేందుకు పన్నాగం పన్నారు. కూటమి ప్రభుత్వం రాకపోతే.. ప్రజల ఆస్తులను ఇప్పటికే దోచుకునేవారు.
+ విశాఖలో అప్పటి ఎంపీ సత్యనారాయణ.. చేయని దారుణం లేదు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కనిపించిన ప్రతి భూమినీ దోచుకున్నారు. అడిగిన వారిపై కేసు పెట్టారు. తన్నించారు.
+ ఒంగోలులో నకిలీ పత్రాలతో ఓ మాజీ మంత్రి 100 కోట్ల విలువైన ఆస్తిని దోచేసేందుకు ప్రయత్నించారు. అక్కడి భూ కబ్జాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం.
+ సినీ ఇండస్ట్రీపై కత్తికట్టినట్టు వ్యవహరించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో ఉన్న ప్రాంతాన్ని కూడా వదలకుండా కబ్జాకు ప్రయత్నించారు. వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను సైతం కొట్టేశారు. దస్పల్లా భూములను కాజేశారు.
+ తిరుపతి, రేణిగుంటలోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన భూములను కూడా వైసీపీ నాయకులు లాగేసుకున్నారు. పేదల అసైన్డ్ భూములు లాక్కున్నారు.
+ కడపలో కాలజ్ఞానం రాసిన పోతులూరి వీర బ్రహ్మంగారి ఆస్తులు కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు. ఆయన కూర్చుని కాలజ్ఞానం రాసిన `కాల జ్ఞానపు కొండ“ను కూడా తొలిచేసే ప్రయత్నం చేశారు.
+ భవిష్యత్తులో ఎవరైనా భూకబ్జా చేయాలంటేనే భయపడేలా చేస్తాం. ప్రజలు తమ భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ఫిర్యాదు చేయాలి. దీనికి ఒక వ్యవస్థను తీసుకువస్తాం.
+ వైసీపీ హయాంలో ఇసుకను తినేశారు.. నాయకులు అన్నం మానేసి ఇసుకను భోం
చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారు. ప్రైవేట్ ఏజెన్సీలకు రెడ్ కార్పెట్ పరిచి.. దోచుకున్నారు.
+ ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు. దేనినీ వదిలి పెట్టకుండా ప్రకృతి సంపద, అడవులను దోచేశారు.