అయ్యో అనిపించే పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా మానవత్వం చచ్చిపోయిందా? అన్న సందేహాలు కలిగేలా కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మనిషి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మనసుల్ని.. మానవత్వాన్ని కూడా పీల్చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేరు.
వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజిపేటలో ఒక పెద్దవయస్కురాలు మరణించారు. ఆమె వయసు 75 ఏళ్లు. మామూలుగా చనిపోతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఆమె తాజాగా కరోనా పాజిటివ్ బారిన పడి.. అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ఒక్కగానొక్క కూతురే సంతానం. అదే ఊర్లో ఉండే కూతురు…తల్లి కరోనాతో చనిపోయారన్న విషయం తెలిసి అంత్యక్రియలకు ముందుకు రాలేదని చెబుతున్నారు.
ఆమె మాత్రమే కాదు.. మరణించిన పెద్దావిడ బంధువులు కూడా ఎవరూ స్పందించలేదు. దీంతో.. స్థానిక కౌన్సిలర్.. మున్సిపల్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని ఖననం చేశారు. పీపీఈ కిట్లు ధరించి.. వృద్ధురాలి డెడ్ బాడీని ట్రాక్టర్ లో తరలించి శశ్మాన వాటికలో ఖననం చేశారు. కన్నకూతురే అంత్యక్రియలకు రాని ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.