వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అదిరిపోయే సవాల్ విసిరారు. “దమ్ముంటే.. చర్చకు రండి“ అంటూ.. దిమ్మతిరిగే కామెంట్లు చేశా రు. దీంతో వైసీపీ వర్సెస్ షర్మిల వ్యవహారం మరింత ముదిరిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనికి వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. రియాక్ట్ కాకపోతే.. షర్మిలదే పైచేయి అవుతందనేది పరిశీలకుల మాట. పైగా.. ఆమెతో పెట్టు కుని అభాసుపాలయ్యారన్న వాదనా వినిపిస్తుంది.
అసలేం జరిగింది?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు “అమ్మకు వందనం“ పేరుతో పిల్లలనుస్కూలుకు పంపించే తల్లులకు రూ. 15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లో చంద్రబాబు ఈ పథకాన్ని భారీ ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయితే, కూటమి సర్కారు ఏర్పడి నెల అయిపోయినా.. దీనిని అమలు చేయలేదంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం “మార్గదర్శకాల“ పేరుతో జీవో 29ని విడుదల చేసింది. దీనిలో “తల్లులు“ తమ ఆధార్ కార్డును రెడీ చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా రేషన్ కార్డును కూడా దగ్గర పెట్టు కోవాలని కోరింది.
ఈ జీవోపై విమర్శలు వచ్చాయి. పిల్లలు ఎంత మంది ఉన్నా పథకం కింద రూ.15 వేల చొప్పున ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు `తల్లులకు` అని ప్రకటించడం ఏంటని.. షర్మిల ప్రశ్నించారు. ఈ సమయంలోనే ఆమె వైసీపీ అధినేత 2019లో కూడా ఇలానే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. అమ్మ ఒడిని రూ.15 వేల చొప్పున అందరికీ ఇస్తామన్నారని.. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కరికే పరిమితం చేశారని షర్మిల నిప్పులు చెరిగారు. తాను కూడా ఊరూ వాడా ప్రచారం చేశానని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇలానే చేస్తే ఊరుకునేది లేదన్నారు.
కట్ చేస్తే.. షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటివారు రియాక్ట్ అయ్యారు. షర్మిల.. చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యానించారని అన్నారు. ఎన్నికలకు ముందు.. తర్వా త కూడా.. చంద్రబాబుకు షర్మిల మద్దతు దారేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన షర్మిల.. వైసీపీపై నిప్పులు చెరిగింది. “వైసీపీ నేతలకు కళ్లుండి, వినడానికి చెవులుండి, విజ్ఞత కలిగిన వాళ్లే అయితే.. మేం చెప్పింది ఏమిటో ఒకటికి పది సార్లు వినాలి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపజేయాలని చంద్రబాబును డిమాండ్ చేశాం“ అని పేర్కొన్నారు.
అంతేకాదు.. గతంలో వైసీపీ తరఫున తాను చేసిన ప్రచారాన్ని కూడా భ్రష్టు పట్టించారని.. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని షర్మిల అన్నారు. “వైసీపీ నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ ముక్క పట్టుకుని నేను రాష్ట్రమంతా ప్రచారం చేయలేదా? ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా? దీనిపై నేను చర్చకు సిద్ధం. మీరు రెడీనా? దమ్ముంటే చర్చకు రండి తేల్చుకుందాం!“ అని షర్మిల వ్యాఖ్యానించారు.