అపర కుబేరులు ముఖేష్ అంబానీ ఇంట అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ వివాహ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ దాదాపు ఏడు నెలల నుంచి సాగుతున్న ఈ వేడుకలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. శుక్రవారం జూలై 12న అనంత్, రాధికల పరిణయ మహోత్సవం చూడటానికి రెండు కళ్లు చాలవు అనేట్లుగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక అయింది.
ఈ రాయల్ వెడ్డింగ్ కు వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులతో పాటు ఇండియన్ మూవీ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. హాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ కూడా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే.. అనంత్ అంబానీ పెళ్లిలో ఓ ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొంత కాలం నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహరంపై తాజాగా ఓ స్పష్టత వచ్చింది. అంబానీ ఇంట ఎలాంటి వేడుక జరిగినా బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ తప్పకుండా హజరవుతుంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి సైతం అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తో సహా మొత్తం ఫ్యామిలీ వచ్చి సందడి చేసింది.
అయితే విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ మాత్రం బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా కనిపించింది. కుటుంబసభ్యులతో రాకుండా కాసేపటి తర్వాత తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా అనంత్ పెళ్లికి హాజరైంది. దీంతో ఐశ్వర్యరాయ్ విడాకుల గోల మొదలైంది. అభిషేక్ బచ్చన్ తో ఆమె విడిపోతుందనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. మరి ఈ వార్తలపై బచ్చన్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.