ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘ఇండియన్-2’ విడుదల ఈ రోజే. 1996లో విడుదలైన ‘ఇండియన్’ మూవీ అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. సౌత్ ఇండియన్ ఫిలిమ హిస్టరీలోనే ఇది బిగ్టెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఒక హిట్ సినిమాకు కొన్నేళ్త తర్వాత సీక్వెల్ రావడం ఇప్పుడు మామూలే కానీ.. మరీ 28 ఏళ్ల విరామం తర్వాత సీక్వెల్ తెరకెక్కడం, మాతృక చేసిన దర్శకుడు, హీరోనే మళ్లీ జట్టు కట్టడం అరుదైన విషయం. అందుకే ‘ఇండియన్-2’ను చాలా ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు.
ఐతే అంత పెద్ద హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుంటుందో అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం.. సినిమా బాగా ఆలస్యం కావడం, ప్రోమోలు ఎగ్జైట్మెంట్ కలిగించకపోవడం. ఒకప్పటితో పోలిస్తే శంకర్ గొప్ప ఫామ్‌లో లేకపోవచ్చు కానీ.. ఆయన ప్రతిభను అంత తక్కువ అంచనా వేయలేం. 90వ దశకంలోనే అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని అసామాన్యమైన కథలతో తెర మీద అద్భుతాలు ఆవిష్కరించిన మాస్టర్ డైరెక్టర్ శంకర్.
కాబట్టి తాను సృష్టించిన కల్ట్ క్యారెక్టర్‌తో ఆయన మరోసారి వెండితెరను వర్ణరంజితం చేయగలడని ఆశలు పెట్టుకోవచ్చు. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తన అభినయంతో మరోసారి ప్రేక్షకులను కట్టి పడేయవచ్చు. కేవలం ట్రైలర్ చూసి సినిమా మీద ఒక అంచనాకు రావాల్సిన పని కూాడా లేదు. సినిమాలో సర్ప్రైజ్లు ఎన్నో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్న నేపథ్యంలో శంకర్‌ను నమ్మి థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లొచ్చు. మరి సేనాపతి పాత్ర మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందా.. ప్రతికూల పరిస్థితులను దాటి ‘ఇండియన్-2’ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుందా.. అన్నది చూడాలి.