అపర కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్ తో జులై 12న అనంత్ అంబానీ ఏడడుగులు వేయబోతున్నారు. ఇందుకు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతోంది. అంబానీ ఇంట వివాహమంటే మాటలా.. దాదాపు ఆరు నెలల ముందు నుంచే హడావుడి షురూ అయింది.
నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు అన్ని కార్యక్రమాలను ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసినట్టుగా జరిపారు. ఇక రేపటి నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. శుభ్ వివాహ్ తో స్టార్ట్ అయ్యే ఈ సెలబ్రేషన్స్ మొత్తం మూడు రోజుల పాటు జరగబోతున్నాయి. అనంత్-రాధికాల వివాహా మహోత్సవానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారు. సినీ తారలు, రాజకీయ, క్రీడా ప్రముఖులు సందడి చేయబోతున్నారు.
అయితే అంబానీ ఇంట జరగబోయే ఈ వివాహానికి టాలీవుడ్ లో కేవలం ఒక్క హీరోకు మాత్రమే ఆహ్వానం అందింది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ల పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఉపాసనతో కలిసి నేడు గురువారం రోజున సతీసమేతంగా హాజరు కాబోతున్నారు. కాగా, గతంలో అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ కి రామ్ చరణ్ దంపతులే హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లికి సైతం చరణ్ కు మాత్రమే ఇన్విటేషన్ రావడం గమనార్హం.