టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు కొత్త మలుపు తిరిగింది. 11 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న రాజ్ తరుణ్ మోసం చేశాడని.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మోజులో పడి తనను వదిలేశాడని లావణ్య అనే యువతి గత వారం హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే మాల్వి, ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ లావణ్య ఆరోపించింది.
అయితే ఈ విషయంపై ఇటు రాజ్ తరుణ్.. అటు మల్వి ఇద్దరూ స్పందించారు. ప్రేమలో ఉన్న మాట నిజమేనని.. కానీ ఇప్పుడామె మస్తాన్ అనే వేరే వ్యక్తితో డేటింగ్ చేస్తుందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేశారు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని వెల్లడించారు. మరోవైపు మాల్వి స్పందిస్తూ.. రాజ్ తరుణ్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే అని వివరించింది. తనతో పాటు తన సోదరుడిని లావణ్య బెదిరిస్తుందని.. తనపై తప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోందని ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై ఫిర్యాదు చేసింది.
అయితే ఈ కేసులో ఆరోపణలకు తగిన ఆధారాలు అందించాలని పోలీసులు ఇటీవల లావణ్యకు నోటీసులు పంపారు. దీంతో ఆమె బుధవారం పోలీసులకు కొన్ని ముఖ్య ఆధారాలు సమర్పించింది. రాజ్ తరుణ్ తో ఉన్న 170 ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్, పలు టెక్నికల్ అండ్ మెడికల్ ఎవిడెన్స్‌లు ఇచ్చింది. ఆమె అందజేసిన ఎవిడెన్స్ లతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక ఈ సందర్భంగా లావణ్య కొన్ని సంచలన విషయాలు రివీల్ చేసి కేసును కొత్త మలుపు తిప్పింది. 10 ఏళ్ల క్రితమే రాజ్ తరుణ్ తో తనకు పెళ్లయిందని, అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య తెలిపింది. కొన్నాళ్ల క్రితం తనకు ప్రెగ్నెన్సీ వస్తే రాజ్ తరుణ్ బలవంతంగా అబార్షన్ చేయించాడని లావణ్య పేర్కొంది. లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో కలిసి ఉంటున్నామని, అన్విక పేరుతో రాజ్ తరుణ్ తో కలిసి తాను విదేశాలకు కూడా వెళ్లానని లావణ్య వెల్లడించింది. ప్రస్తుతం లావణ్య తెలిపిన ఈ విషయాలు మీడియాలో సెన్సేషన్ గా మారాయి.