ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైఎస్సార్ కలలుగన్నారని, ఆ వైపుగా కృషి చేసిన వారే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్ షర్మిల మాత్రమే రాజశేఖర్ రెడ్డి వారసురాలని, జగన్ కాదని పరోక్షంగా అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. దురదృష్టం వెంటాడడంతో రాహుల్ గాంధీ ప్రధాని కాకముందే వైఎస్ చనిపోయారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ చేసిన పాదయాత్ర స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేశారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆ యాత్ర కూడా కారణం అన్నారు. దేశంలో సంక్షేమ పాలన పేరు చెప్పగానే గుర్తు వచ్చేది వైఎస్ఆర్ పాలన అని, పేదల గుండెల్లో వైఎస్ఆర్ బలమైన ముద్ర వేశారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి అని రేవంత్ చెప్పారు. మూడేళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు.
ప్రతిపక్ష నేతగా రాహుల్ రాణిస్తున్నారని, ప్రధాని పదవికి రాహుల్ ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఈరోజు దేశపు చారిత్రక అవసరమన్నారు. అందరూ కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మరోవైపు, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనను గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదని, ఆయనను కోల్పోవడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని చెప్పారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్రకు ఒక రకంగా వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని అన్నారు. ప్రజానీకానికి వైఎస్సార్ నిజమైన నాయకుడని, వ్యక్తిగతంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.