తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు వరుస షాకులిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ ‘హస్త’గతమయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా కృష్ణమోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. బీఆర్ఎస్ నేతలు వరుసబెట్టి పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ కు షాక్ తగిలినట్లు అవుతుంది. అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ ఇదే విధంగా పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పుడు అదే ఫార్ములాను రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారని టాక్ వస్తుంది.
ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కు 31 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కంటే ముందు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరారు.