ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చాలా వరకు తన ఇంటికే పరిమితం అయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొన్ని రోజులు తాడేపల్లిలోని ఇంట్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత పులివెందులకు వెళ్లి అక్కడ కొన్ని రోజులు గడిపారు. ఆ తర్వాత బెంగళూరుకు చేరుకున్న అక్కడ ప్యాలెస్లో పది రోజులకు పైగా సేదదీరారు.
ఫలితాల అనంతరం ఆయన బయటికి వచ్చి చేసిన ఏకైక పని.. ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టడమే కాక, అనేక దౌర్జన్యాలకు పాల్పడి జైలు పాలైన తమ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం. ప్రతిపక్షంలోకి వెళ్లాక ఏదైనా ప్రజలకు సంబంధించిన కార్యక్రమంలో రాజకీయ యవనిక కార్యక్షేత్రంలోకి పునరాగమనం చేస్తాడనుకుంటే.. తీవ్ర నేరం చేసి అడ్డంగా దొరికిపోయిన నేతను పరామర్శించడానికి వెళ్లడం జగన్ నైజానికి నిదర్శనమని ప్రత్యర్థులు ఆయన తీరును ఎండగడుతున్నారు.
ఇదిలా ఉంటే.. పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం జగన్ మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా మీమ్స్ మోత మోగుతోంది. ముఖ్యంగా అందులో పిన్నెల్లిని సమర్థించబోయి ఆయన్ని అడ్డంగా ఇరికించేశాడంటూ ఒక సినిమా సన్నివేశానికి ముడిపెట్టి తయారు చేసిన మీమ్ వైరల్ అవుతోంది. ఒక సినిమాలో లాయర్ పాత్రలో సప్తగిరి.. పోసాని కోసం కేసు వాదించే క్రమంలో అతడినే ఇరికించేలా మాట్లాడతాడు. దీంతో పోసాని వీడెవడో నాకు తెలియదు అంటూ జడ్జి దగ్గర మొరపెట్టుకుంటాడు.
కానీ, జడ్జి మాత్రం లాయర్ వాదనతో ఏకీభవించి పోసానికి శిక్ష విధిస్తాడు. ఇక రియాలిటీలోకి వస్తే, మొన్న మీడియా ముందు జగన్ మాట్లాడుతూ.. పిన్నెల్లికి రిగ్గింగ్ చేసుకునే అవకాశమే ఉంటే, పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటే అలా ఈవీఎంను పగలగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో జగన్ పిన్నెల్లికి మద్దతుగా మాట్లాడబోయి ఆయన్ని ఇరికించేస్తున్నట్లు ఉందంటూ ఆ సినిమా దృశ్యానికి జగన్ ఆడియోను జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.