ఏపీలో వైసీపీ కార్యాలయాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ.. కూటమి ప్రభుత్వం నోటీ సులు ఇవ్వడం.. వాటిని తొలగిస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా తాడేపల్లిలో నిర్మిస్తున్న కేంద్ర కార్యాల యాన్ని వారం రోజుల కిందటే నేల మట్టం చేశారు. ఇక, జిల్లాల్లో నిర్మించిన భవనాలను కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. వాటిని కూడా కూల్చేస్తామంటూ .. అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులుకోర్టుకు వెళ్లారు.
ఇప్పటికి రెండు సార్లు విచారించిన ఏపీ హైకోర్టు తాజాగా మధ్యంతర తీర్పు వెలువరించింది. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని.. రాష్ట్ర ముసిపల్ శాఖను ఆదేశించింది. అదేసమయంలో కూల్చివేతలకు సంబంధించి ప్రజలకు ఇబ్బందిగా ఉండే భవనాలను రెగ్యులర్ చేసే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించింది. ఉద్దేశ పూర్వకంగా కూల్చివేస్తున్నారన్న వైసీపీ తరఫు న్యాదివాదనలను కూడా పరిగణన లోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇలాంటి వాటిని చూస్తూ ఉపేక్షించబోమని చెప్పింది.
అయితే.. నిబంధనలు పాటించాలని తాము ఖచ్చితంగా చెబుతున్నామని.. నిబంధనలకు విరుద్ధంగా ఏది ఉన్నా.. సహించేది లేదని స్పష్టం చేసింది. అలాగని రాజకీయ కక్ష, ఇతర వ్యక్తిగత అంశాలను పరిగణనలోకితీసుకోరాదని అధికారులకు తేల్చి చెప్పింది. ఇదేసమయంలో వైసీపీ వాదనలను వినిపించేందుకు.. సంబంధిత పత్రాలు చూపించేందుకు తగిన సమయం ఇవ్వాలని.. రాత్రిరాత్రికి.. ఇబ్బందులు పెట్టడాన్ని సహించబోమని వ్యాఖ్యానించింది.
వైసీపీ వాదనలను ప్రతి దశలోనూ వినాలని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే.. అధికారులు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాజకీయ జోక్యానికి తావులేకుండా అధికారులు వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ జోక్యం ఉందని నిరూపితమైతే.. అధికారుల పై చర్యలు తీసుకునేందుకు తాము వెనుకాడబోమని హెచ్చరించింది. మొత్తంగా వైసీపీకి కొంత ఉపశమనం కల్పిస్తూ.. తీర్పు ఇవ్వడం గమనార్హం.