ఏపీ రాజధాని అమరావతి ప్రస్తుత పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. 2019కి ముందు.. ఒక రూపాన్ని తీసుకువచ్చామని.. కీలక కట్టడాలను.. దాదాపు పూర్తి చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్, జడ్జిల సముదాయాలను 90 శాతం పూర్తి చేశామన్నారు. వీటికి ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలాయని.. వాటిని పూర్తి చేసి ఉంటే.. ఎప్పుడో వారికి కేటాయించే పరిస్థితి ఉండేదన్నారు.
ఇక, ఇతర ప్రాంతాల్లోనూ అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కానీ, జగన్ హయాంలో దీనిని పక్కన పెట్టడంతో పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. ఫలితంగా.. ఇప్పుడు జీరో స్థాయి నుంచి అమరా వతిని డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ పరిస్థితి రావ డం ఆలోచించాల్సిన విషయమే. అమరావతిలో లోపాలు జరిగాయని.. టీడీపీ నాయకులు ముందస్తు వ్యాపారం చేశారని.. ఆరోపించిన జగన్.. దీనిని నాశనం చేశారనడంలో సందేహం లేదు.
కానీ, లోపాలను సరిదిద్దుతూ.. అమరావతిని ముందుకు తీసుకువెళ్లి ఉంటే.. తనదైన శైలిలో తనదైన కార్పొరేట్ మైండ్ సెట్‌తో జగన్ వ్యవహరించి ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఆయన అలా చేయ లేదు. పైగా.. ఐదేళ్ల పాటు రాజధానిని అలానే ఉంచేశారు. మరోవైపు. ఇక్కడ కట్టడాలను కొందరు ధ్వంసం చేస్తున్నారు.. ముడి సరుకును చోరీ చేస్తున్నా.. సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అన్నీ తామై.. రైతులే రాజధానిని కాపాడుకునే పరిస్థితి వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటికే 8000 కోట్ల పెట్టుబడులతో ఒక రూపం సంతరించుకున్న రాజధాని.. జగన్ పాలన.. అత్యుత్సాహం.. కారణంగా మూలనపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజధానిని జీరో నుంచి స్టార్ట్ చేసి మళ్లీ.. ప్రారంభించే పరిస్థితి వచ్చింది. దీనికి మరింత సొమ్ములు ఖర్చువుతాయని తాజాగా చంద్రబాబు సైతం ఒప్పుకొన్నారు. గడిచిన ఐదేళ్లలో కనీసం చిన్న పాటి నిర్మాణాలనైనా పూర్తి చేసి ఉంటే.. రాజధానిని కాపాడి ఉంటే.. ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు.