ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, ఇకపై రోజువారీ విచారణ చేపట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. జగన్ కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని కోరుతూ 2024 ఎన్నికలకు ముందు కాపు నేత, మాజీ కేంద్ర మంత్రి హరి రామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం రోజువారీ విచారణ చేపట్టి ఆ కేసులను త్వరగా తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ, ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని హైకోర్టులో రామజోగయ్య పిల్ దాఖలు చేశారు. విచారణ ముందుకు సాగనివ్వడం లేదంటూ జగన్ పై ఆరోపణలు చేశారు. మరోవైపు, జగన్ అక్రమాస్తుల కేసులో విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని నాటి వైసీపీ రెబల్ నేత, నేటి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీబీఐని ఈ కేసులో విచారణ విచారణలో జాప్యానికి గల కారణాలు చెప్పాలంటూ సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.
ఇక, క్విడ్ ప్రోకో నేపథ్యంలో జగన్ పై మొత్తం 20 చార్జ్ షీట్లు సిఐడి, ఈడి దాఖలు చేశాయి. 12 ఏళ్లుగా సిబిఐ కోర్టులలో ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. గతంలో జగన్, విజయసాయి దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్లు తీర్పు వెల్లడి కాలేదు. ఆ జడ్జి బదిలీ కావడంతో ఆ కేసు వాదనలను తాజాగా నియమితులైన జడ్జి మళ్ళీ వినాల్సి వచ్చింది.