బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. అలా అని చెప్పి.. ఎవరికి వారు తాము ఆ పని చేస్తామంటూ తీర్పులు ఇచ్చేస్తూ.. తాము చెప్పినట్లుగా ఆదేశాలు జారీ చేయటం లేదంటే తమ వాళ్లతో కలిసి తాము డిసైడ్ చేసింది చేసుకుంటూ పోతే.. ఈ వ్యవస్థ ఎందుకు? అన్నది ప్రశ్న. ప్రతిది సిస్టం ప్రకారం జరగాల్సిందే. లేదంటే అరాచకం ఒక రేంజ్ కు వెళుతుంది. తాజాగా అలాంటి విపరీతానికి తెర తీశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
తన వద్దకు వచ్చిన బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం విమర్శలకు తావిచ్చేలా మారటమే కాదు.. చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారింది. దీనికి తోడు తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం కావటమే కాదు వేలాది మంది తీవ్ర అవస్థలకు గురయ్యారు.
ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే.. ఎన్టీఆర్ జిల్లాలోని కంభంపాడులో వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారవు ఒక బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ భవనం మీద ఆరోపణలు ఉన్నాయి. తమ స్థలంలో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా కంభంపాడుకు చెందిన ముస్లిం మహిళతో పాటు విస్సన్నపేటకు చెందిన మరో ఇద్దరు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడికి కంప్లైంట్ చేశారు.
దీంతో స్పందించిన ఆయన.. ఆదివారం కంభంపాడుకు వచ్చి తనకు ఫిర్యాదు వచ్చిన భవనాన్ని పరిశీలించారు. దాన్ని అక్రమ నిర్మాణమని భావించిన ఆయన.. ఆ భవనాన్ని తొలగించి బాధితులకు స్థలాన్ని అప్పజెప్పాలని ఆదేశించారు. ఒకవేళ.. అధికారులు కానీ తొలగించకపోతే తానే కూల్చేస్తానంటూ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఇందుకు తగ్గట్లే మంగళవారం తెలుగుదేశం, జనసేనకు చెందిన నేతలు.. కార్యకర్తలతో కలిసి పొక్లెయిన్.. డోజర్ తో సదరు భవనం వద్దకు చేరుకున్నారు. దీనికి ప్రతిగా వైసీపీకి చెందిన ఎంపీపీ వర్గానికి చెందిన వారు అక్కడకు చేరుకన్నారు. అక్రమణలను తొలగించే వరకు తాను అక్కడి నుంచి కదలనంటూ ఎమ్మెల్యే తన వాహనం మీద ఎక్కి కూర్చోవటంతో విషయం చూస్తుండగానే పెద్దదిగా మారింది.
దీంతో ఎమ్మెల్యేను సముదాయించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కూల్చివేతను అడ్డుకున్న మైలవరం ఏసీపీ.. తాము సర్వే చేసి అక్రమణలు ఉంటే తొలగిస్తామని చెప్పినా ఎమ్మెల్యే వినలేదు. సత్వర న్యాయం జరగాలని.. బాధితులకు న్యాయం చేయాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పొక్లెయిన్ సిబ్బంది డాబా దిగువ గదిని పాక్షికంగా కూల్చేశారు. అతి కష్టమ్మీదా.. మిగిలిన భవనాన్ని కూల్చకుండా అధికారులు అడ్డుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఇది అక్రమ నిర్మాణంగా పంచాయితీ కార్యదర్శి నోటీసు అంటింంచారు.
భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పగా.. దీనికి ప్రతిగా ఎంపీపీ నాగలక్ష్మి తాము ఎవరి స్థలాన్ని అక్రమించుకోలేదేని.. అక్రమంగా భవనాన్ని నిర్మించటం లేదంటూ నిరసనకు దిగారు. తన అనుచరులతో కలిసి నిర్మాణంలోని ఒకటో అంతస్తులో బైఠాయించారు. అదే సమయంలో ఎమ్మెల్యే రావటం.. దీంతో హడావుడి మరింత పెరగటం.. తన వాళ్లతో కలిసి నిర్మాణాన్ని పాక్షికంగా కూల్చేయటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణం అయితే.. ప్రొసీజర్ ప్రకారం కూల్చేయటం తప్పు లేదు. కానీ.. తక్షణ న్యాయం పేరుతో షాపులోకి వెళ్లి చింతపండు కొన్నట్లుగా చేయటం ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.