జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎన్నెన్ని మాటలు అనేవాళ్లో, ఎంతగా ఎగతాళి చేసేవారో గుర్తుండే ఉంటుంది. వాళ్లకు ఏపీలో సొంత ఇళ్లు లేవని.. ఉండేది హైదరాబాద్‌లో, రాజకీయాలు చేసేది ఏపీలో అంటూ ఎద్దేవా చేసేవాళ్లు. రోజంతా ఏపీలో తిరిగి.. రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోతారని.. ఇలాంటి వాళ్లు ఏపీకి అవసరమా అని విమర్శించేవాళ్లు.
ఐతే ఇటీవలి ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. కూటమి ఘనవిజయంతో అధికారంలోకి వచ్చింది. కట్ చేస్తే ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీని వదిలిపెట్టిపోయారు. ప్రమాణ స్వీకారం చేయక తప్పదు కాబట్టి ఆ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ పని పూర్తయిన నిమిషాలకే అసెంబ్లీని విడిచిపెట్టారు. మళ్లీ సభకు రాలేదు.
తర్వాతి రోజు తన నియోజకవర్గమైన పులివెందులకు వెళ్లారు. అక్కడో రెండు రోజులు గడిపి బెంగళూరులోని తన ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. జగన్ బెంగళూరుకు చేరుకుని పది రోజులు దాటింది. అప్పట్నుంచి పార్టీ నేతలకు, జనాలకు అందుబాటులో లేరు.
ఆయన ఎప్పుడు ఏపీకి తిరిగొస్తారనే సమాచారం పార్టీ వర్గాలకు కూడా లేదని అంటున్నారు. అధికారంలో ఉండగా పవన్‌ను పార్ట్ టైం పొలిటీషియన్ అని.. ఆయనతో పాటు చంద్రబాబు ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారని ఎద్దేవా చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితం అయిపోయిన జగన్ గురించి ఏం చెబుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు జగన్ అసెంబ్లీకి ఎగ్గొట్టడం మీద ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. దానికి సమాధానం చెప్పలేని వైసీపీ నేతలు.. ఇప్పుడు జగన్ బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితం కావడాన్ని ఎలా సమర్థించుకుంటారో చూడాలి.