ఈ రోజు ముగిసిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిసారి శాసనసభలో ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తొలి స్పీచ్ లోనే లోకేష్ అద్భుతంగా మాట్లాడిన వైనంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సభలో ప్రతిపక్షం లేదని, స్వపక్షమే ప్రతిపక్షంలా మారి ప్రజా సమస్యలపై సభ లోపల, బయట చర్చించాలని లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 43 ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతూ అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లో ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో సభను గౌరవప్రదంగా నడుపుదామని పిలుపునిచ్చారు.
అయ్యన్నపాత్రుడితో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కడం తన అదృష్టం అని అన్నారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, తనకు ఆయన ఎన్నోసార్లు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారని అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు అని, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని చెప్పారు.
వైసీపీ పాలనలో అయ్యన్నపై కక్ష సాధించారని, 23 కేసులు పెట్టినా ఆయన భయపడలేదని ప్రశంసించారు. అలుపెరగకుండా పోరాటం చేశారని ప్రశంసించారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచి టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సభా గౌరవం మసకబారిందని, సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులకు దిశా నిర్దేశం చేయాలని అయ్యన్నపాత్రుడును లోకేష్ కోరారు.